ఢిల్లీకి మూటలు మోస్తున్న సీఎం రేవంత్‌

ఢిల్లీకి మూటలు మోస్తున్న సీఎం రేవంత్‌– ఐదు నెలల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది
– ముస్లింలందరికీ తానే నాయకుడినని ఓవైసీ కలలు కంటున్నారు. : ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాహుల్‌ ట్యాక్స్‌ పేరుతో రాష్ట్రంలో దందాలు చేసి ఢిల్లీ అధిష్టానానికి మూటలు మోస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌ రెడ్డి ఆరోపించారు. పదేండ్ల మోడీ పాలనపై ఫోరంఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఆధ్వర్యంతో శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ఐదు నెలల పాలనలో అవినీతి, అక్రమ వసూళ్లు పెరిగిపోయాయని విమర్శించారు. ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్ధీన్‌ ఓవైసీ హిందూ, ముస్లింల మద్య వైషమ్యాలను పెంచేం దుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. వాజ్‌పేయి నుంచి నరేంద్రమోడీ వరకు బీజేపీ హయాంలో అన్ని మతాల ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తు న్నారని పేర్కొన్నారు. దేశంలోని ముస్లింలందరికీ నాయకునిగా చెలామణి కావాలని అసద్‌ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఐదు దశాబ్దాలుగా పాత బస్తీని పాలిస్తున్న ఆ కుటుంబం అక్కడి ప్రజల అభివృద్ధికి పాటు పడ్డ పాపాన పోలేదని ఆరోపించారు. ఎంఐఎం నేతలు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వంత పాడుతూ తమను తాము కాపాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎం డీఎన్‌ఏ ఒకటేనని చెప్పారు. మూడు పార్టీలు కుటుంబ పార్టీలనీ, వారికి తమ అధికారం తప్ప ప్రజల బాగోగులు పట్టవని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్‌, బీజేపీ పాలనకు చాలా తేడా ఉందనీ పైరవీలకు, అవినీతికి ఆస్కారం లేకుండా బీజేపీ ప్రజలకు నీతి వంతమైన పాలన అందిస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్‌ పాలనలో ఢిల్లీలోని ఆంధ్రా భవన్‌ క్యాంటీన్‌ పైరవీకారులతో నిండిపోయేదని అన్నారు. బీజేపీ పాలనలో దేశ రాజధాని వీధుల్లో పైరవీకారులు, కాంట్రాక్టర్లు కనిపించడం లేదని పేర్కొన్నారు.