కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌ భేటీ

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ నేషనల్‌ జనరల్‌ సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. లోధిరోడ్‌లోని కేసీ వేణుగోపాల్‌ నివాసంలో ఆయనను కలిసారు. ఈ భేటిలో సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి ఉన్నారు. దాదాపు గంట పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, ఆరు గ్యారెంటీల అమలు తీరును నేతలు కేసీ వేణుగోపాల్‌కు వివరించారు. అలాగే లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికపై మంతనాలు జరిపారు. నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో పార్టీ పట్టు, సీటు ఆశిస్తోన్న అభ్యర్థుల వివరాలపై చర్చించినట్టు సమాచారం. అలాగే మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ అంశంపైనా సమాలోచన చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అనంతరం ఢిల్లీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటి రెడ్డి హైదరాబాద్‌ చేరుకున్నారు.