– ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చ
– పార్టీ కోసం త్యాగం చేసినోళ్లకే మొదటి ప్రాధాన్యత
– భారత్ జోడోన్యారు యాత్ర, లోక్‌సభ ఎన్నికల సన్నాహకాలపై చర్చ
– కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షీలతో సుదీర్ఘ మంతనాలు
– నేడు అగ్రనేతలతో కలిసి మణిపూర్ వెళ్లనున్న సీఎం, డిప్యూటీ సీఎం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం తమ సీట్లను త్యాగం చేసినోళ్లకే ఎమ్మెల్సీ స్థానాల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిసింది. అలాగే సామాజిక న్యాయంతో పాటు… విద్యావేత్తలకు స్థానం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ముఖ్యనేతలకు వివరించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. శనివారం సాయంత్రం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత 67 రోజులు 15 రాష్ట్రాల గుండా సాగే భారత్ జోడో న్యారు యాత్రపై చర్చించారు. అలాగే లోక్‌సభ ఎన్నికల సమయాత్తంపై మంతనాలు జరిపారు. తరువాత తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితులు, లోక్‌సభలో గెలుపు అవకాశాలను రేవంత్ వివరించారు. అలాగే ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక, ఇతర అంశాలను అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. తెలంగాణలో కాంగ్రెస్ నెల రోజుల పాలన, ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల కూర్పుపై ఖర్గే, రాహుల్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఉత్సాహంతో లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచించారు.
కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షీ, భట్టిలతో సుదీర్ఘ మంతనాలు
అంతకుముందు పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ దీపాదాస్ మున్షీలతో ఏ. రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. కేసీ వేణుగోపాల్ నివాసంలో గంటపాటు సాగిన ఈ భేటీలో… ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు చేశారు. తాజాగా రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్, గవర్నర్ కోటాలో రెండు, స్థానిక సంస్థలు, పట్టభద్రుల కోటాలో మరో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికను ఫైనల్ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ ఆరు స్థానాలకు దాదాపు డజన్‌కు పైగా నేతలు పోటీ పడుతున్నారు. అయితే ఈనెల 15 నుంచి సీఎం రేవంత్ దావోస్ పర్యటనకు వెళ్లనుండడం, ఈనెల 18తో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశం చర్చించింది. అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం, జిల్లాల వారీగా ప్రాధాన్యత, పార్టీ కోసం అసెంబ్లీ ఎన్నికల్లో తమ సీటు త్యాగం చేసిన నేతల జాబితాను పరిశీలించారు. త్వరలో లోక్‌సభ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల విషయంలో లోతుగా చర్చించారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం సరిగా లేకపోవడం, మైనార్టీ వర్గానికి పెద్ద పీఠ వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఒకవేళ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించలేని నేతలను నామినేటెడ్ పదవులతో బుజ్జగించాలని నిర్ణయం చేశారు. అనంతరం ఢిల్లీ తెలంగాణ భవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ముఖ్యనేతలు కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షీలతో నిర్వహించిన భేటీలో చర్చించిన ముఖ్యాంశాలను భట్టికి వివరించినట్లు తెలిసింది. అనంతరం ఖర్గే కార్యాలయం నుంచి రేవంత్‌కు ఫోన్‌కాల్ రావడంతో హుటాహుటిన రాజాజీ మార్గ్‌లోని ఖర్గే నివాసానికి రేవంత్ బయలు దేరి వెళ్లారు.
నేడు మణిపూర్‌కు సీఎం
నేడు మణిపూర్‌లోని తౌబల్ నుంచి ప్రారంభమయ్యే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యారు యాత్రలో సీఎం ఏ. రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టిలు పాల్గొననున్నారు. ఇందుకోసం ఆదివారం ఉదయం పార్టీ చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీ, ఏఐసీసీ మెంబర్లు, అన్ని రాష్ట్రాల పీసీసీలు, ముఖ్యనేతలు ప్రత్యేక విమానంలో మణిపూర్ చేరుకోనున్నారు. అనంతరం కాసేపు రాహుల్‌తో కలిసి యాత్రలో పాల్గొననున్నారు. రాత్రి తిరిగి ఢిల్లీ చేరుకుంటారు. అర్థరాత్రి తర్వాత దావోస్ వేదికగా ఈ నెల 15 నుంచి 18 వరకు సాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు బయలుదేరి వెళ్లనున్నారు.
టికెట్ ఆశిస్తోంది వీళ్లే…
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం సీట్లు వదులుకున్న అద్దంకి దయాకర్, చిన్నారెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్‌లలో ఇద్దరికి అవకాశం ఉంది. అలాగే గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండ రాం, విద్యారంగ నిపుణులు జాఫర్ జావేద్ (ముఫకంజా కాలేజ్ చైర్మెన్)ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్, షబ్బీర్ అలీలు సైతం మైనార్టీ కోటాల్లో ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. వీరితో పాటు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, జానా రెడ్డి, బలరాం నాయక్, సంపత్ కుమార్, మధుయాష్కీ, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్‌లు ఎమ్మెల్సీలుగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. పొడెం వీరయ్య కూడా తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.