నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎన్నికల ప్రచారంలో అనేక వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసాక వాటిని గాలికొదిలేసి అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలం అయ్యారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గం సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య అన్నారు. పార్టీ అశ్వారావుపేట మండల కార్యదర్శి వర్గం సమావేశం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయం సుందరయ్య భవన్ లో కార్యదర్శి వర్గ సభ్యులు మడిపల్లి వెంకటేశ్వరరావు అద్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య హాజరై ప్రసంగించారు.ఆరు వాగ్ధానాలు అమలు చేస్తామని మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి చాలీచాలని బస్సులతో ప్రయాణీకులకు ఇబ్బందులు పాలు చేస్తున్నారని ఎద్దేవా చేసారు.ఉచిత విద్యుత్ సైతం పాక్షికంగా నే అమలు చేస్తున్నారని,గృహ జ్యోతి పధకం అంతంత మాత్రమేనని వాపోయారు.త్వరలో అమలు చేయనున్న ఇందిరమ్మ గృహ నిర్మాణంలో లబ్ధిదారులు ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేసారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు బి.చిరంజీవి,మండల కార్యదర్శి సోడెం ప్రసాద్,ముల్లగిరి గంగరాజు,తగరం నిర్మల,మడకం గోవిందు,కారం సూరిబాబు లు పాల్గొన్నారు.