
నవతెలంగాణ – సిద్దిపేట
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు కోసం ప్రచారంలో భాగంగా నేడు సిద్దిపేటలో కార్నర్ మీటింగ్ కు రానున్నారు. ఆయన సిద్దిపేటకు సీఎం అయిన తర్వాత మొదటిసారి వస్తున్న సందర్భంగా ఇక్కడి మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావుపై ఎలాంటి ఛాలెంజ్ లు, సవాళ్లు చేయనున్నారు అంశంపై నియోజకవర్గమంతా చర్చించుకుంటున్నారు. ఈ మధ్యనే రైతు లకు రెండు లక్షల రుణమాఫీ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సభలలో మాట్లాడుతూ ఆగస్టు 15లోగా చేస్తానని చెప్పడం, దానిపై ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించడంపై ఒకరికొకరు రాజీనామాల చేసుకుందాం వరకు దారి తీసింది. అంతేకాకుండా హైదరాబాదులోని అమరవీరుల స్థూపం వద్దకు హరీష్ రావు తన రాజీనామా పత్రాన్ని తీసుకువచ్చి బహిరంగంగా సీఎంకు తాను ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సవాలు విసిరారు. దీనిపై స్పందించిన సీఎం ఆగస్టు 15 వరకు వేచి ఉండాలని, ఆలోగా రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పారు. ఆగస్టు 15 తర్వాత రాజీనామా ఇవ్వాలని హరీష్ రావును ఆయన కోరారు. రుణమాఫీ జరగకుంటే తాను బాధ్యత తీసుకుంటానని సీఎం అన్నారు. రాష్ట్రమంతటా హాట్ టాపిక్ గా మారిన ఇద్దరి మధ్య సవాళ్లు నేడు సిద్దిపేటకు సీఎం రానుండడం పట్ల రాష్ట్రంలోని రాజకీయ విశ్లేషకులు అందరూ ఆసక్తిగా సిద్దిపేట వైపు చూస్తున్నారు. ఈ మధ్యనే సిద్దిపేటలో ఆటో యూనియన్ కార్మికులతో జరిగిన సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ ఏ ముఖం పెట్టుకొని సిద్దిపేటకు రేవంత్ రెడ్డి వస్తాడు, కొడంగల్ కు తరలించిన వెటర్నరీ కళాశాలను తిరిగి తీసుకు వచ్చిన తర్వతనే సిద్దిపేటలో ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. ఇలాంటి తరుణంలో గురువారం సాయంత్రం నాలుగు గంటలకు సిద్దిపేట కలెక్టరేట్ ఆవరణలోని హెలీప్యాడ్ వద్దకు హెలిక్యాప్టర్లో సీఎం చేరుకొనున్నారు. అక్కడినుండి వాహనాల ద్వారా బీజేఆర్ చౌరస్తాకు చేరుకుంటారు. అక్కడినుండి కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీతో పాత బస్టాండ్ వద్దకు చేరుకొని కార్నర్ మీటింగ్ ను నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సీఎం ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారు, ఎలాంటి సవాళ్లు విసరన్నారు, సిద్దిపేటకు ఏమి హామీలు ఇవ్వనున్నారు అంశంపై సర్వత్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.