ఆర్థికపరిస్థితిపై స్పష్టత లేని సీఎం రేవంత్‌ రెడ్డి

– మాజీ ఎంపీ బి.వినోద్‌ కుమార్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్‌ రెడ్డికి స్పష్టత, దార్శనీకత లేదని మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్‌ నేత బోయినపల్లి వినోద్‌ కుమార్‌ విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సచివాలయంలో సమీక్షా సమయంలో ఒకలా, ఐఎస్‌ బీ కార్యక్రమంలో మరో రకంగా మాట్లాడారని తప్పు పట్టారు. ముఖ్యమంత్రి లోతుగా సమీక్షించడం లేదనీ, రాష్ట్రంలో ఏ వర్గంలో విశ్వాసం కల్పించకపోవడంతోనే ఆదయం తగ్గిందని తెలిపారు. హైడ్రా కూల్చివేతల ప్రభావం రియల్‌ ఎస్టేట్‌ రంగంపై పడిందన చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. రాష్ట్ర జీఎస్డీపీని వన్‌ ట్రిలియన్‌ ఎకానమీ గా మారుస్తానంటున్న రేవంత్‌ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. రిజర్వేషన్లపై రేవంత్‌ సర్కార్‌కు రాజ్యాంగ స్ఫూర్తి కొరవడిందని తెలిపారు.