– స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీగా రామానంద తీర్థ సంస్థ అప్ గ్రేడ్
– 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సెంటర్లు
– వందెకరాల స్థలంతోపాటు మెరుగైన వసతులు : రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ జి చిన్నారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భూదాన్ పోచంపల్లిలోని రామానందతీర్థ గ్రామీణ సంస్థను స్కిల్ డవలప్‌మెంట్ వర్సిటీగా మార్చాలన్న సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం యువతకు గొప్ప వరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ డాక్టర్ జి చిన్నారెడ్డి అన్నారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి శివారులోని జలాల్ పూర్ గ్రామంలో ఉన్న ఆ సంస్థను ఆయన సందర్శించారు. శిక్షణా కార్యక్రమాలు, ప్రయోగశాలలు, తరగతి గదులు, విద్యార్థుల హాస్టల్ గదులను ఆయన నిశితంగా పరిశీలించారు. రామానంద తీర్థ సంస్థను స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేయాలన్న ఆలోచనతో సీఎం తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. త్వరలో 30 లక్షల మంది యువతకు ప్రభుత్వ పరంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా ఉచిత శిక్షణతోపాటు స్టయిఫంద్ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ నోడల్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సెంటర్లను నెలకొల్పుతామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఉద్యోగ ఉపాది అవకాశాలపై కార్యాచరణ అమల్లోకి వస్తుందని వివరించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల వారిగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే అనేక స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు అందుబాటులో వస్తాయని పేర్కొన్నారు. వందెకరాల స్థలంతోపాటు మెరుగైన వసతులు, యూనివర్సిటీ స్థాయి కోసం మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా ఆ సంస్థ డైరెక్టర్ లక్ష్మీ, సహా సిబ్బందితో సమావేశమయ్యారు.