అబద్ధాల పునాదులపై సీఎం రేవంత్‌ ప్రస్థానం

– హరీశ్‌రావు సవాల్‌ను ఎందుకు స్వీకరించరు?
– హామీల అమలులో పూర్తిగా వైఫల్యం : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానమే అబద్ధాలపునాదులపై నిలబడి ఉందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు రాకపోతే తన సీటుకు ఎసరొస్తుందని ఆయన భయపడుతున్నారన్నారు. అందుకే దేవుళ్ళ మీద ఓట్టు పెడుతున్నారని గుర్తు చేశారు. విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళే తడి బట్టల్తో గుడుళ్లోకి వెళ్తారని చెప్పారు. రుణమాఫీ, గ్యారంటీలను అమలు చేయక పోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్‌ విసిరారనీ, దానిపై నేరుగా స్పందించకుండా మాటల గారడీతో ప్రజలను మభ్య పెడుతున్నారని విమర్శిం చారు.హరీశ్‌రావు ఉద్యమ ప్రారంభం నుంచి కేసీఆర్‌కు కుడి భుజంగా ఉన్నారని గుర్తు చేశారు. రేవంత్‌ సవాళ్లు చేస్తారు కానీ.. మాట మీద నిలబడరని ఎద్దేవా చేశారు.