పదవిని కాపాడుకునేందుకు సీఎం రేవంత్‌ తంటాలు

– తిట్ల పురాణం ఆపి హమీలపై దృష్టి పెట్టు : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన పదివిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎంపీ స్థానాలు గెలవకపోతే సీఎం కుర్చీ పోతుందని రేవంత్‌ భయపడుతున్నారని విమర్శించారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టిన సీఎం నాలుగు నెలలకే ప్రజల విశ్వాసం కోల్పోయారని విమర్శించారు. తన అసహనాన్ని ఇతర పార్టీల నేతలపై తిట్ల రూపంలో చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆగస్టులో రైతు రుణమాఫీ చేస్తామంటూ మహబూబాబాద్‌, మెదక్‌ సభల్లో రేవంత్‌ రెడ్డి దేవుడిపై ప్రమాణం చేసి చెప్పారనీ, ఆ రకంగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడ్డ ఆయనపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ప్రజలు సాగు, తాగునీరు, విద్యుత్‌ లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, సీఎంతో పాటు మంత్రులు రాజకీయాలు చేస్తూ కాలం గడుపుతున్నారని విమర్శించారు. పవర్‌ మినిస్టర్‌ భట్టి సీపీఐ ఆఫీస్‌కు వెళ్తే అక్కడ అరగంటపాటు కరెంటు పోయిందని గుర్తు చేశారు. విద్యుత్‌ శాఖ మంత్రికే ఈ పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు. ప్రజా సమస్యల పేరుతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పిలిపించుకుని కాంగ్రెస్‌ కండువా కప్పేందుకు సీంఎ రేవంత్‌ ప్రయతత్నిస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, గడ్డం రంజిత్‌ రెడ్డిపై ఆ పార్టీ క్యాడర్‌ తిరుగుబాటు చేస్తోందని గుర్తు చేశారు.