– వారికోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి : మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి ప్రయివేటు టీచర్లపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారంనాడాయన మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావుతో కలిసి తెలంగాణ భవన్ విలేకరులతో మాట్లాడారు. 2009 ఆగస్టులో విద్యా హక్కు చట్టం వచ్చి, రాజ్యాంగ సవరణ ద్వారా విద్య ప్రాధమిక హక్కుగా మారిందని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 40,941 పాఠశాలలు ఉంటే, ప్రభుత్వ పాఠశాలలు 30,307 ఉన్నాయన్నారు. మొత్తం 50 లక్షలు మంది విద్యార్థులు ఉంటే, అందులో 51 శాతం ప్రయివేటు పాఠశాలల్లోనే ఉన్నారని వివరించారు. ప్రయివేటు పాఠశాలలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదన్నారు. ప్రయివేటు స్కూళ్లలో పదో తరగతి ఫెయిల్ అయిన వారు ఉపాధ్యాయులుగా ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారనీ, అది ఎవరి తప్పు అని ప్రశ్నించారు. విద్యా హక్కు చట్టం ప్రకారం శిక్షణ పొందినవారే ఉపాధ్యాయులుగా ఉండాలని చెప్పారు. ప్రయివేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు విద్యా సెస్ వసూలు చేసైనా, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. వారికి రిటైర్మెంట్ తర్వాత కూడా సాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో రెండు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రయివేటు పాఠశాలల్లోకి వెళ్లారనీ, సీఎం రేవంత్‌రెడ్డి దానిపై దృష్టి పెట్టాలని సూచించారు. త్వరలో లక్ష మంది ప్రయివేటు ఉపాధ్యాయులతో సభ పెట్టి, సంరక్షణ చట్టంం కోసం ఒత్తిడి తెస్తామని చెప్పారు.