సీఎం సారూ..కనీస వేతనాలను సవరించండి

సీఎం సారూ..కనీస వేతనాలను సవరించండి– సమాన పనికి సమాన వేతనం ఇప్పించేలా చూడండి
– డీసీఎల్‌ పోస్టులు భర్తీ చేయాలి.. కార్మిక శాఖను బలోపేతం చేయాలి 
– సీఎం రేవంత్‌రెడ్డికి సీఐటీయూ బృందం వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో 15 ఏండ్లుగా 75 షెడ్యూల్డ్‌ ఎంప్లాయిమెంట్స్‌లో కనీస వేతనాలను సవరించలేదనీ, మీరైనా సవరించి కార్మికులకు న్యాయం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని సీఐటీయూ రాష్ట్ర బృందం కోరింది. సమాన పనికి సమాన వేతనం ఇప్పించేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. కార్మిక శాఖలోని డీసీఎల్‌తో పాటు ఇతర పోస్టులను భర్తీ చేసి కార్మిక శాఖను బలోపేతం చేయాలని విన్నవించింది. మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితో కలిసి సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌, రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌ సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. సీఎం పదవిని చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న కీలక సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. 15 ఏండ్లుగా కనీస వేతనాలను సవరించకపోవడం వల్ల కార్మికుల కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు. గత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కనీస వేతనాలు పెంచుతూ విడుదల చేసిన జీఓలను కూడా పారిశ్రామికవేత్తల ఒత్తిడితో అమలు చేయకుండా పెండింగ్‌లో పెట్టిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కార్మిక వర్గానికి తీవ్ర నష్టం చేసే నాలుగు లేబర్‌ కోడ్‌లను తెలంగాణలో అమలు చేయబోమని చెబుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. 2012లో ఐదు రంగాలకు రూ.18 వేల కనీస వేతనంతో ఇచ్చిన ఫైనల్‌ నోటిఫికేషన్‌ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, సమాన పనికి – సమాన వేతనం ఇవ్వాలని విన్నవించారు. నూతన పెన్షన్‌ స్కీమ్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని విజ్జప్తి చేశారు. మెడికల్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ సమస్యలు, స్కీమ్‌ వర్కర్లలో అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, ఐకేపీ, ఉపాధి హామీ తదితర స్కీమ్‌ ఉద్యోగుల జీతాలు పెంచాలని సీఎంని కోరారు.
గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీలు, జీహెచ్‌ఎంసీలలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల నుంచి బిల్‌ కలెక్టర్ల వరకు ప్రభుత్వమే నేరుగా వేతనాలివ్వాలనీ, జీవో నెంబర్‌ 51ని సవరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలనీ, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, పశుమిత్రలు, స్కూల్‌ స్వీపర్లు తదితరుల డిమాండ్లు వినతిపత్రంలో ప్రస్తావించామని చెప్పారు.
వైద్యారోగ్య శాఖలోని కాంట్రాక్ట్‌ పారామెడికల్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలనీ, 142, 317 జీఓలను సవరించాలని కోరారు. యూనివర్సిటీ నాన్‌టీచింగ్‌ సిబ్బంది వేతనాలు పెంచాలని కోరారు. ఆర్టీసీని విస్తరించడంతో పాటు ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేర్చాలనీ, విద్యుత్‌ రంగంలో ఆర్టిజన్స్‌ అందరికీ కన్వర్షన్‌ ఇవ్వాలని విన్నవించారు. భవన నిర్మాణ రంగం మాదిరిగా ట్రాన్స్‌పోర్ట్‌, హమాలీ, బీడీ తదితర రంగాల కార్మికులకు వెల్ఫేర్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. పవర్‌లూమ్‌ కార్మికులకు, సెక్యూరిటీ గార్డులు, గిగ్‌ కార్మికులు, తదితరులకు చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని కోరారు. కార్మికుల సమస్యలు విన్న తర్వాత సీఎం సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత కార్మిక శాఖ అధికారులతో చర్చించి న్యాయం చేస్తామని సీఎం హామీనిచ్చారని తెలిపారు.