రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలోని వివిధ విభాగాల్లో గత పదిహేనేండ్లుగా సుమారు ఇరవైవేల మంది వివిధ హోదాల్లో పని చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబాన్ని కూడా పోషించుకోలేక పస్తులుంటున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి, సమాన పనికి సమాన వేతనమివ్వాలని ఎన్ని వినతిపత్రాలిచ్చినా గత సర్కార్ పట్టించుకోలేదు. అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పీసీసీ అధ్యక్షుడు, రేవంత్‌రెడ్డి ‘మేం అధికారంలో వచ్చాక మీ సమస్యలు పరిష్కరిస్తాం’ అని హామీనిచ్చారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తయింది. కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు నిర్వహించుకుంటున్నది. కానీ ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగుల బతుకుల్లో మాత్రం వెలుగులు నింపడం లేదు. అందుకే వారు ఆవేదనతో మళ్లీ పోరుబాట పట్టారు. క్లస్టర్ రిసోర్స్, యం.ఐ.యస్ కో ఆర్డినేటర్‌లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఐ.ఈ.ఆర్. పిలు, జిల్లా స్థాయిలో ఏ.పి.ఓలు సిస్టమ్ అనలిస్టులు, టెక్నికల్ పర్సన్లు, డి.ల్.ఎం.టి మెసెంజర్లు, పాఠశాల స్థాయిలో ఆర్ట్, క్రాఫ్ట్, వర్క్ ఎడ్యూకేషన్ పార్టు టైం ఇన్‌స్ట్రక్టర్, కేజీవీబీ యు.ఆర్.ఎస్‌లలో స్పెషల్ ఆఫీసర్, సి.ఆర్.టి లు, స్కావెంజర్స్ మెసెంజర్‌లు ఎంతోకాలంగా ప్రభుత్వానికి వారి హోదాలతో నిమిత్తం లేకుండా అన్ని పనులు చేసుకుంటూ వస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు సీఆర్పీలను స్కూల్ అసిస్టెంట్లకు సమానమైన విద్యార్హతతో నియమించారు. డిగ్రీ , బిఈడి, బిటెక్, పూర్తిచేసిన వారు సీఆర్పీలుగా విధుల్లో వున్నారు. వీరికి నెలకు వేతనం రూ.19,350 మాత్రమే. అదే విధంగా కేజీబీవీ, యంఆర్సీలో టీచింగ్, నాన్ టీచింగ్ కంప్యూటర్ ఆపరేటర్లు ఎంఐఎస్ సమన్వ యకర్తలు ఐఆర్పీలు, ఎంఆర్సీ మెసెంజర్లకు తదితరులు కూడా పనిచేస్తున్నారు. వీరిలో యం.ఐ.యస్ కో ఆర్డినే టర్‌ది సూపరింటెండెంట్ హోదాతో సమానం. వీరంతా తక్కువ వేతనాలతో ప్రభుత్వానికి ఎక్కువ సేవలంది స్తున్నారు. వీరు కూడా తమను క్రమబద్ధీకరిం చాలని ఎంతోకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విద్యా శాఖ నిర్వహించే పనులతో పాటు ప్రభుత్వం నిర్వహించే ఇతర కార్యక్రమాలకు కూడా వీరు సేవలందిస్తున్నారు. కొంత మందిని స్పెషలాఫీసర్లుగా నియమించారు. వీరు టీచర్ల కు మండల విద్యా వనరుల కేంద్రానికి, జిల్లా విద్యాధికారి కార్యాలయానికి సమాచారం చేరవేస్తారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల ఆధీనంలో వీరు పని చేస్తున్నారు.
అన్ని జిల్లాల్లో వీరు క్లస్టర్ పరిధిలోని విద్యార్థుల ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని నమోదు చేసి అధికారులకు నివేదికలు అందజేయడం, ప్రతిరోజు ఒక పాఠశాలను సందర్శించి ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఉపాధ్యాయుల విద్యార్థులు హాజరుతో పాటు మధ్యాహ్న భోజన వివరాలను పరిశీలించడం ప్రదానంగా చేస్తారు.అలాగే బడి బయట పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పించడం, పాఠశాల నుంచి విద్యార్థుల వివరాలను సేకరించి యుడైస్ ప్లస్‌లో నమోదు చేయడం సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా నిర్వహించే కార్యక్రమాలు పాఠశాలల్లో అమలయ్యేలా చేయడం, ఏకోపాధ్యాయ పాఠశాలలో ఉపాధ్యాయుడు సెలవుపై వెళ్తే ఆ క్లస్టర్ పరిధిలోని సీఆర్పీ ఆ పాఠశాలను నడిపించడం, ప్రతినెలా పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశం ఏర్పాటు చేసేలా చూడటం, ఆ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో వీరిది కీలకపాత్ర. కానీ వీరికి ఉద్యోగ భద్రత లేదు, సమాన పనికి సమాన వేతనమూ లేదు. ఉపాధ్యా యులకు కావలసిన అన్ని అర్హతలున్నా పట్టించుకోవడం లేదు. సీఎం గారూ..ఇప్పటికైనా వీరు ప్రభుత్వానికి అందిస్తున్న సేవలు, వీరి కుటుంబాల పరిస్థితిని చూసి ఇప్పటికైనా వీరికి ఉద్యోగ భద్రత కల్పించి, సమస్యలు పరిష్కరించేలా చూడాలని కోరుతున్నారు.
– కామిడి సతీష్‌రెడ్డి, 9848445134