సీఎం గారూ.. వారి ఆవేదనను అర్థం చేసుకోండి

– ‘ఎక్స్‌’ లో హరీశ్‌రావు కామెంట్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీని సీఎం రేవంత్‌రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేస్తూ మెదక్‌లో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను పోలీసులు నిర్బంధించడాన్ని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల టెంట్ల ముందు నుంచే వెళ్లిన సీఎం, టెంట్లు పీకేయడం కాదు, వారి సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు. 15రోజులుగా ఆందోళన చేస్తున్న వారి ఆవేదనను అర్థం చేసుకోవాలని సూచించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చారు తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల సమస్యలు తీరుస్తామని రేవంత్‌ రెడ్డి చెప్పిన మాటను హరీశ్‌రావు ఈసందర్భంగా గుర్తుచేశారు. వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేస్తామని హామీ ఇచ్చి, ఏడాది గడిచినా ఉలుకు లేదు, పలుకు లేదని విమర్శించారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న విధంగానే సమగ్ర శిక్ష ఉద్యోగులను కూడా కాంగ్రెస్‌ పార్టీ నమ్మించి మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పుడు రోడ్డెక్కి నిలదీస్తే అక్రమ నిర్బందాలకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది హేయమైన చర్య అని విమర్శించారు.