– పాల్గొన్న డిప్యూటీ సీఎం, మంత్రులు
– జ్యోతి ప్రజ్వలనతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
– స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేత
నవతెలంగాణ-యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి దంపతులు సోమవారం సందర్శించారు. ఉదయం 10 గంటల కు యాదాద్రికి చేరుకున్న ముఖ్యమంత్రికి స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. వారితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం అర్చక బృందం ఆశీర్వాదం ఇచ్చారు. దేవాదాయశాఖ అధికారులు ధర్మకర్త నర్సింహా మూర్తి, ఈవో రామకృష్ణారావు సీఎం దంపతులకు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రులతో కలిసి సీఎం జ్యోతి ప్రజ్వలన చేసి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కుంభ అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశం, మందుల సామేల్, జెడ్పీ చైర్మెన్ సందీప్ రెడ్డి, రాచకొండ సీపీ తరుణ్ జోషి, జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జెండగే, దేవదాయ శాఖ అడిషనల్ కమిషనర్ జ్యోతి, మున్సిపల్ చైర్మెన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్, ఎంపీపీ చీర శ్రీశైలం, జెడ్పీటీసీ తోటకూరి అనురాధ ఇతర నాయకులు పాల్గొన్నారు.