నేడు ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాలతో సీఎం సమావేశం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. ఈ మేరకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు శనివారం ఒక ప్రకటన విడుదల చేశాయి. .ఈ సమావేశంలో పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు చర్చకు రానున్నట్టు వారు తెలిపారు. రెండేండ్లుగా డీఏలు ఇవ్వకపోవటంతో వారిలో పెరిగిన అసంతృప్తి గురించి ప్రభుత్వానికి వివరించనున్నట్టు వారు పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల వ్యవహరించిన విధానాల వల్లే ఆ ప్రభుత్వం అధికారం కోల్పోయిందని వారు గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచిన ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, పెండింగ్‌ బిల్లులు, కేజీబీవీ ఉద్యోగులకు ఎంటీఎస్‌ తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టికి తీసుకుపోనున్నట్టు వారు పేర్కొన్నారు. సీపీఎస్‌ రద్దు, 317 జీవో ద్వారా నష్టపోయిన ఉద్యోగ ఉపాధ్యాయుల ను వెంటనే వారి స్వస్థలాలకు పంపే విధంగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నట్టు వారు తెలిపారు.