– అందుకే మంత్రివర్గంలో స్థానం లేదు
– ఆర్‌ఎస్‌ఎస్ మూలాలే కారణం
– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్‌ఎస్‌ఎస్ మూలాలున్న ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి మైనార్టీలపై ప్రతీకారం తీర్చుకుంటున్నారనీ, అందుకే మంత్రివర్గంలో వారికి స్థానం కల్పించలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విమర్శించారు. గత ఎన్నికల్లో మైనార్టీలు బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చినందుకే వారిపై కాంగ్రెస్ పార్టీ పగ పట్టిందన్నారు. ఎన్నికలకు ముందు మైనార్టీ సెంటిమెంట్ కోసం షబ్బీర్ అలీ పేరును వాడుకున్న కాంగ్రెస్ ఆయనకు సలహాదారు పదవి ఇచ్చి చేతులు దులుపుకుందని ఆరోపించారు. ఈ విషయంలో కాంగ్రెస్- బీజేపీది ఫెవికాల్ బంధం అని ఎద్దేవా చేశారు.
గత పార్లమెంట్ ఎన్నికల మాదిరే ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కవుతాయనీ, వీరి బంధాన్ని మైనార్టీలు అర్థం చేసుకోవాలని కోరారు. హౌం శాఖ కూడా నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డే తాజా మత ఘర్షణలకు పూర్తి బాధ్యత వహించాలన్నారు. శనివారంనాడిక్కడి తెలంగాణ భవన్‌లో జరిగిన మైనార్టీ విభాగం సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి 50 రోజుల పాలనలో ఒక్కరోజు కూడా మైనార్టీ సంక్షేమంపై సమీక్ష నిర్వహించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి లబ్ది చేకూర్చేలా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.
ఆటోలో కేటీఆర్…
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ముగించుకున్న కేటీఆర్ యూసఫ్‌గూడా నుంచి ఆటోలో తెలంగాణ భవన్‌కు వచ్చారు. మార్గమధ్యంలో ఆటో డ్రైవర్‌తో మాట్లాడుతూ వారి సమస్యలు, కష్టాలు అడిగి తెలుసుకున్నారు. తాము చాలా ఇబ్బందుల్లో ఉన్నామనీ, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆటో డ్రైవర్ కోరారు. ఆటోల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి ప్రభుత్వం తమకు రీయింబర్స్‌మెంట్ చేస్తే బాగుంటుందని ఆటో డ్రైవర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ఒత్తిడి తీసుకొస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ హామీ ఇచ్చారు.
పాలనలో పోటీ పడండి
మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రజారంజక పాలనకంటే మరింత మెరుగైన పాలన చేసేలా ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి పోటీపడాలని బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రావణ్, బూడిద భిక్షమయ్య గౌడ్, ఎమ్ శ్రీనివాస్‌రెడ్డి హితవు పలికారు. శనివారంనాడిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ తెచ్చిన బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను రేవంత్‌రెడ్డి దుర్భాషలాడటాన్ని వారు తప్పుపట్టారు. రేవంత్‌రెడ్డిని తీవ్ర పరుష పదజాలంతో దూషించారు. కాంగ్రెస్ వాళ్లకు కోపం వస్తే ఐదేండ్లలోపే ఆయన సీఎంగా దిగిపోతారని విమర్శించారు.