న్యూఢిల్లీ: ప్రముఖ ఆటో దిగ్గజం బజాజ్ ఆటో ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైకును ఆవిష్కరించింది. శుక్రవారం దీన్ని కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ విడుదల చేశారు. ఫ్రీడమ్ 125 పేరుతో అందుబాటులోకి తెచ్చింది. సీఎన్‌జీతో పాటు పెట్రోల్‌తో కూడా నడిచే విధంగా ట్విన్ ట్యాంక్‌ను డిజైన్ చేసింది. 125సీసీ ఇంజిన్‌తో లభిస్తుంది. ఫ్రీడమ్ డిస్క్ ఎల్‌ఈడీ, ఫ్రీడమ్ డ్రమ్ ఎల్‌ఈడీ, ఫ్రీడమ్ డ్రమ్ వేరియంట్లలో లభించనున్న వీటి ధరలను వరుసగా రూ.1.10 లక్షలుగా, రూ.1.05 లక్షలు, రూ.95,000గా నిర్ణయించినట్లు ఆ కంపెనీ తెలిపింది. సాధారణ పెట్రోల్ బైక్‌తో పోలిస్తే 50 శాతం తక్కువ ఆపరేటింగ్ ఖర్చుతో ఈ బైక్ నడుస్తుందని ఆ కంపెనీ తెలిపింది. మహారాష్ట్ర, గుజరాత్‌లో మాత్రమే ప్రస్తుతం లభిస్తుందని.. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు అందుబాటులోకి తెచ్చేది స్పష్టం చేయలేదు.