పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం

6 coress– ఆరు గ్యారంటీలపై ఫోకస్‌…
– పట్టం కట్టిన ప్రజలకు ధన్యవాదాలు
– మంత్రి వర్గంలో ఖాళీ బెర్తుల భర్తీ ఎలా?
– నేడు కాంగ్రెస్‌ పీఏసీ భేటీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీపీసీసీ అధ్యక్షులు, సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి పార్టీపై దృష్టిసారించారు. ఒకవైపు ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీగా ఉంటూనే…పార్టీ బాధ్యతలపై ఫోకస్‌ చేశారు. ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశమవుతున్నది. రేవంత్‌ సీఎం అయ్యాక తొలిసారిగా పార్టీ సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రధానంగా తాజా రాజకీయ పరిస్థితులు, ఎన్నికల ఫలితాలు వంటి అంశాలను చర్చిస్తూనే..ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ సమావేశం తీర్మానం చేయనుంది.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూ.చ తప్పకుండా అమలు చేస్తామని మరోసారి ప్రజలకు భరోసా ఇవ్వనుంది. గ్యారంటీల అమలు విషయంలో ప్రభుత్వంతోపాటు పార్టీ పాత్ర ఎలా ఉండాలనే అంశంపై చర్చించి కార్యాచరణ రూపొందించనుంది. మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్‌, రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పథకానికి పది లక్షలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాలను ఇప్పటికే అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కాంగ్రెస్‌ భావిస్తున్నది. మంత్రివర్గంలో ఖాళీల భర్తీ గురించి కూడా కమిటీలో చర్చించనున్నట్టు తెలుస్తున్నది.
ఆ ఆరుగురు మంత్రులెవరో?
రాష్ట్ర మంత్రివర్గంలో మరో ఆరుగురు మంత్రులకు అవకాశం ఉన్న నేపథ్యంలో దీనిపై కూడా ఈ భేటీలో ప్రాథమిక చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఉమ్మడి
ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు ప్రస్తుత మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఆయా జిల్లాల నుంచి ఎవరెవర్ని తీసుకోవాలనే అంశంపై ప్రభుత్వానికి పీఏసీ సూచనలు చేసే అవకాశం ఉన్నది. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ ఒక సీటు కూడా గెలువని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాతినిధ్యం లేని జిల్లాల్లో ఆరు మంత్రి పదవులు ఎవరికి దక్కనున్నాయనేది నేడు హాట్‌ టాపిక్‌గా మారింది.హైదరాబాద్‌ లాంటి మహానగరంలో పార్టీ అభ్యర్థులు గెలువక పోగా మంత్రిపదవి దక్కలేదు. అవకాశం కల్పిద్దామనుకున్న సీనియర్లమో ఓటమి చవిచూశారు. దీంతో ఎవరికి మంత్రిపదవి ఇవ్వాలనే దానిపై కాంగ్రెస్‌ పార్టీ మల్లాగుల్లాలు పడుతున్నది. ఓడిన వారిలో కాంగ్రెస్‌ పార్టీకి లాయల్‌గా ఉండే నేతలకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రి పదవి ఇచ్చే యోచనలో పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఇవ్వడానికైనా, మంత్రిపదవి దక్కడానికైనా సామాజిక సమీకరణలు తప్పని సరి పాటించాలని పార్టీ వర్గాల్లో వాదనలు వినిపిస్తున్నాయి.
సామాజిక సమీకరణాలు
మైనార్టీ, ఎస్టీ, ఎస్సీ, బీసీ సామాజిక తరగతులకు ఎలా అవకాశం ఇవ్వాలనే దానిపై పార్టీలో అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. మైనార్టీ కోటాలో నిజామాబాద్‌, నాంపల్లి స్థానాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, నాంపల్లి నుంచి పోటీ చేసి ఓటమి చవి చూసిన ఫిరోజ్‌ఖాన్‌లు పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో ఒకరికి ఛాన్స్‌ లభించే అవకాశాలు ఉన్నాయి. పార్టీలో ఉన్న ఆదివాసీ, లంబాడ సామాజికవర్గం సీనియర్‌ నేతలపై పార్టీ దృష్టి పెట్టింది. ఆదివాసీల్లో కోయసామాజిక వర్గానికి చెందిన సీనియర్‌ నేత మాజీ, ఎమ్మెల్యే పోడెం వీరయ్య పేరు ప్రధానంగా వినిపిస్తోంది. భద్రాచలంలో ఆయన ఓడిపోయినా ఆదివాసీ ప్రజాప్రతినిధిగా గత మూడు దశాబ్ధాలకు పైగా పార్టీకి సేవచేస్తూ పార్టీకి విధేయుడిగా ఉన్నందున పోడెెంను పరిగణలోకి తీసుకుంటున్నట్టు తెలిసింది. ఎస్సీ సామాజిక వర్గాల్లో ఇప్పటికే ఇద్దరికి అవకాశం కల్పించినా మరో ఎస్సీకి మంత్రి వర్గంలో స్థానం దక్కే అవకాశం ఉన్నది. ఎస్సీ సామాజికవర్గంలో మంత్రి పదవి రేసులో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి, ఆయన సోదరుడు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ పేర్లు వినిపిస్తున్నాయి. సీనియర్లయిన ఈ ఇద్దరిలో ఏ ఒక్కరికైనా మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గాల్లో కేవలం ఒక్కరికే మంత్రి వర్గంలో స్థానం లభించింది. గౌడ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్‌కు ఇప్పటికే మంత్రి పదవి దక్కగా, బీసీలకు మరో మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ఓడిపోయిన పార్టీ సీనియర్లను సైతం పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మాజీ ఎంపీలు మధు యాష్కిగౌడ్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌లు ఈ రేసులో ఉన్నారు. ఈ ఇద్దరిలో ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఓసీ కోటాలో మైనంపల్లి హన్మంతరావు, అదేవిధంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది.
మంత్రివర్గంలో ఖాళీలు అందుకేనా?
64 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది పోను 42 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురిని ఎంపిక చేయాల్సి ఉన్నది. అందులో సీనియర్లు కూడా చాలా మంది ఉన్నారు. కానీ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరితే వారికి మంత్రి పదవులు ఇవ్వాల్సి వస్తుందనీ, అందుకే మంత్రివర్గంలో ఖాళీలు పెట్టినట్టు కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. హైదరాబాద్‌ నగరానికి చెందిన సీనియర్‌ మాజీ మంత్రి కూడా సీఎం రేవంత్‌రెడ్డిని కలిసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తనకు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్‌లో చేరుతానని షరతు పెట్టినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆయన చేరితే మరికొంత మంది కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇతర పార్టీలకు చెందిన వారిని బీఆర్‌ఎస్‌లో చేర్చుకుని ప్రతిపక్షాలను బలహీన పరిచిందన్న విమర్శలున్నాయి. అదే తప్పు కాంగ్రెస్‌ పార్టీ చేయొద్దంటూ పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.