– ఆర్జి-3 ఏరియా టిబిజీకెఎస్ వైస్ ప్రెసిడెంట్ నాగేల్లి సాంబయ్య
నవతెలంగాణ-రామగిరి: సింగరేణి బొగ్గు బ్లాక్ లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని, సింగరేణి ప్రాంతంలోని బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థకు అప్పగించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి బొగ్గు బ్లాగులను వేలం ప్రక్రియలో చేర్చడాన్ని నిరసిస్తూ అర్జీ-3 ఏపీఏ ఏరియా ఉపాధ్యక్షుడు నాగేల్లి సాంబయ్య ఆధ్వర్యంలో సెంటినరీ కాలనీ తెలంగాణ చౌరస్తాలో బుధవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దహనం చేసి మాట్లాడారు.
సింగరేణి సంస్థ కోట్ల రూపాయలు ఖర్చు చేసి తెలంగాణలో బొగ్గు నిక్షేపాలను గుర్తించినట్లు తెలిపారు. భూగర్భములోని బొగ్గును వెలికితీయడానికి సింగరేణి సంస్థకు హక్కులు కల్పించడం సహజ న్యాయమని ఆయన అభిప్రాయవడ్డారు. సింగరేణి సంస్థ ఇప్పటివరకు అత్యంత సమర్ధవంతంగా భూగర్భంలోని బొగ్గు నిక్షేపాలను రక్షణతో ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా 135 సంవత్సరాలుగా వెలికితీస్తున్నట్లు తెలిపారు. నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేసి వినియోగదారుల మన్ననలను పొందుతున్న సింగరేణి సంస్థను కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థగా లక్షలాదిమంది ప్రజలకు ఆర్థికంగా ప్రయోజనము చేకూరుస్తున్నట్లు తెలిపారు. ప్రజల జీవితాలలో వెలుగులు నింపుతూ, ప్రభుత్వాలకు వేలకోట్ల రూపాయలను వన్నుల రూపేనా చెల్లిస్తున్నట్లు వివరించారు. గత కొంతకాలంగా కొత్త బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకు. కేటాయించకపోవడం వలన, పాత బ్లాకులలో బొగ్గు నిల్వలు కరిగిపోతుండడం వలన సింగరేణి ఉనికికి ప్రమాదం ఏర్పడిందని ఆయన వాపోయారు.
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న 41 వేల మంది ఉద్యోగుల భవిష్యత్తు అందోళనకరంగా మారిందని, ఈ నేపథ్యంలో కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించదలచిన కోయగూడెం, సత్తుపల్లి బొగ్గు బ్లాకులను ప్రస్తుతం వేలం ప్రక్రియలో ఉన్న శ్రావణపల్లి ఓసిపి గనితోపాటు, కళ్యాణ్ ఖని 6 బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే కేటాయించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియలో సింగరేణి సంస్థ పాల్గొనకూడదని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనటం అంటేనే ప్రైవేటీకరణకు అంగీకరించడమని టీబీజీకేఎన్ బావిస్తోందని ఆయన పేర్కొన్నారు. బొగ్గు బ్లాక్ ల వేలంలో పాల్గొనకుండానే ఎంఎండిఆర్-2015 చట్టం 17 సెక్షన్ 2 ఆధారంగానే సింగరేణి సంస్థకు బొగ్గు బ్లాకులను ప్రభుత్వం కేటాయించే విధంగా ఒప్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు పింగిలి సంపత్ రెడ్డి,కె కేశవరావు దాసరి మల్లేష్, ఉప్పు వెంకటేశ్వర్లు, అల్లం తిరుపతి,బొడ్డు వినయ్, శివ శంకర్, గణేష్, గండి శ్రీనివాస్, సంతోష్, చంద్రశేఖర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.