బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలి

Coal mines should be allotted to Singareni– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు అడివయ్య
నవతెలంగాణ-ఖానాపూర్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల వేలం పాటను ఆపి సింగరేణికే కేటాయించాలని, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం. అడివయ్య అన్నారు. ఆదివారం ఖానాపూర్‌లో సీపీఐ(ఎం) నిర్మల్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు బ్లాకును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టేందుకు కుట్ర పన్నుతోందని అన్నారు. శ్రావణపల్లిలో సింగరేణి సంస్థ బొగ్గు తవ్వి కేంద్ర ప్రభుత్వం వేలంపాట ద్వారా ప్రయివేట్‌ సంస్థలకు బొగ్గు గనులు తవ్వే అవకాశం కల్పించడం సరైంది కాదన్నారు. మన రాష్ట్రం నుంచి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి హైదరాబాద్‌ కేంద్రంగా వేలంపాటను ప్రారంభించడం హేయమైన చర్య అని అన్నారు. బొగ్గు గనులన్నీ ప్రయివేటు సంస్థలకు ఇచ్చిన తర్వాత సింగరేణికి ఇంకా ఏమి మిగులుతుందని అన్నారు. క్రమంగా సింగరేణి సంస్థను బలహీనపరిచి, నిర్వీర్యం చేసే ప్రయత్నం కేంద్రం చేస్తుందని అన్నారు. నగదీకరణ పేరుతో దేశంలో ఆరు లక్షల కోట్ల విలువైన ఆస్తులను కేంద్ర ప్రభుత్వం ప్రయివేటు సంస్థలకు కట్టబెట్టిందని అందులో భాగంగానే కోట్ల విలువైన గనులను ప్రయివేటు సంస్థలకు ఇవ్వాలని నిర్ణయాన్ని తీసుకుందని విమర్శించారు. గత పది సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 200 బొగ్గు బావులను ప్రయివేట్‌ సంస్థలకు కట్టబెట్టారని, ప్రభుత్వ రంగంలో గనులు లేకపోతే యువతకు ఉపాధి అవకాశాలు కనుమరుగవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా బొగ్గు గనుల వేలాన్ని అడ్డుకోలేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రస్తుతం సింగరేణిలో 40 వేల మంది పర్మినెంట్‌ కార్మికులు ఉంటే మరో 30 నుంచి 35 వేల మంది కాంట్రాక్టు కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నదని అన్నారు. రికార్డు స్థాయిలో అతి తక్కువ ధరకే నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేస్తున్న ఘనత సింగరేణి సంస్థకే చెందుతుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక రూపాలలో ఆదాయాన్ని తీసుకొస్తున్న సింగరేణిని ప్రయివేటీకరణకు అప్పజెప్పి ప్రభుత్వం ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ధమననీతిని రాష్ట్ర ప్రజానీకం ఖండించాలని అన్నారు. బొగ్గు గనుల ప్రయివేటీకరణ వేగంగా జరిగితే, విద్యుత్తు ధర విపరీతంగా పెరుగుతుందని అన్నారు. సింగరేణికి చెందిన 22 బొగ్గు బావుల్లో బొగ్గు నిల్వలు అడుగంటి పోయాయని, కొత్త బ్లాకుల తవ్వకాలు ప్రారంభించాలి. కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇందుకు అనుమతించకుండా అడ్డుపడుతున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల తెలంగాణ ప్రజానీకానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. శ్రావణపల్లి బ్లాకుతో పాటు మిగతా బ్లాక్‌లను కూడా తక్షణమే సింగరేణికి అప్పగించాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వము అఖిలపక్షాన్ని కలుపుకొని కేంద్రం మీద ఒత్తిడి చేయాలని డిమాండ్‌ చేశారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొని శాసనసభ తీర్మానం చేయాలని లేని పక్షంలో ప్రజానీకాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చూడుతామని హెచ్చరించారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తి అయినప్పటికీ ఇంతవరకూ హామీని అమలు చేయలేదని అన్నారు. పైగా పేదలు వేసుకున్న గుడిసెలు తొలగించే కార్యక్రమం చేస్తున్నారని ఆరోపించారు. ఇది సరైన నిర్ణయం కాదని అలాంటి నిర్ణయాలను వెంటనే విడనాడాలని అన్నారు. ఇందిరమ్మ ఇంటి పథకాన్ని వీరికి అమలు చేసి, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గౌతమ్‌ కృష్ణ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం నూతన్‌ కుమార్‌, బొమ్మెన సురేష్‌, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు తొడసం శంభు, ఇప్ప లక్ష్మణ్‌, గంగామణి, పార్టీ ఖానాపూర్‌ మండల కార్యదర్శి నాగెల్లి నర్సయ్య, జిల్లా నాయకులు ఫసియోద్దీన్‌ పాల్గొన్నారు.