సంకీర్ణ రాజకీయాలే కీలకం

– లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీల వ్యూహాలు
– బీజేపీని ఢ కొట్టేందుకు ‘ఇండియా’ కూటమి పావులు
– రామమందిరం అంశం మీదే కాషాయపు పార్టీ ఆశలు
న్యూఢిల్లీ: దేశంలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. విజయం కోసం పార్టీలు ఇప్పటికే వ్యూహాలను రచిస్తున్నాయి. పొత్తులకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా, ఇండియా కూటమిలోని పార్టీలైతే బీజేపీ ఓటమే లక్ష్యంగా అనేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నాయి. ఇక బీజేపీ మాత్రం అయోధ్యలో రామ మందిర నిర్మాణం అంశంపై ప్రధానంగా ఆధారపడింది. ఈ అంశంపై ఆ పార్టీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రచారం చేసుకుంటున్నది. తమ పార్టీ అధికారంలో ఉన్న కారణంగానే అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధ్యమవుతున్నదని ఆ పార్టీ చెప్పుకుంటున్నది. ఈనెల 22న రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని సైతం బీజేపీ, ఆరెస్సెస్‌లు తమ కనుసన్నల్లో నడిపిస్తున్నాయని కాంగ్రెస్‌లాంటి పార్టీలు ఆరోపిస్తున్నాయి. 22న జరగబోయే కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే బహిష్కరించిన విషయం విదితమే. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పలు పార్టీలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఆలయ నిర్మాణం విషయంలో రాజకీయ నాయకుల నుంచే కాదు.. సాక్షాత్తూ హిందూ మత పెద్దలే కొందరు లోపాలను లేవనెత్తుతున్నారు. ఆలయ నిర్మాణం పూర్తి కాకుండా ఇలాంటి కార్యక్రమాలు జరపటం ఏ మాత్రమూ సరికాదని అంటున్నారు. కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే మోడీ ప్రభుత్వం విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఆగమేఘాల మీద నిర్వహిస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు.
రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్‌, జేడీ(యూ), సీపీఐ(ఎం), సీపీఐ వంటి వామపక్షాలు, ఆర్జేడీ, డీఎంకే సహా పలు పార్టీలతో కూడిన ‘ఇండియా’ కూటమి మధ్య ప్రధానంగా పోరు సాగనున్నది. 2014 ముందు వరకు ఒక విస్పష్ట మెజారిటీ లేకుండా దాదాపు రెండు దశాబ్దాలకు పైగా సంకీర్ణ ప్రభుత్వాలు, సంకీర్ణ రాజకీయాలు రాజ్యమేలాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఎన్డీయే రెండు దఫాల పాలనలోనూ బీజేపీకి మెజారిటీ ఉన్నా.. మిత్రపక్షాలతో పాలనను సాగించిందని అంటున్నారు. అయితే, ఈ ఏడాదిలో షెడ్యూల్‌ ప్రకారం జరగబోయే ఎన్నికల్లో మాత్రం రాజకీయాలు ఆసక్తికరంగా మారనున్నాయనీ, సంకీర్ణ రాజకీయాలు మళ్లీ బలంగా మారను న్నాయని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. జాతీయ పార్టీలుగా బీజేపీ, కాంగ్రెస్‌లు కీలకంగా ఉన్నప్పటికీ.. ప్రాంతీయ పార్టీల ప్రభావాన్ని తక్కువ అంచనా వేయలేమని చెప్తున్నారు.
భారత రాజకీయాల్లో మీడియా పాత్ర చాలా కీలకమైనది. అయితే, మోడీ పాలనలో మాత్రం పత్రికా స్వేచ్ఛ తగ్గింది. మీడియాపై ఒత్తిడి పెరిగింది. బీజేపీ అనుకూల వ్యక్తులు, బడా వ్యాపారవేత్తల చేతిలోనే ఇప్పుడు దేశంలోని వార్త ఛానెళ్ళు నడుస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వాలు, మోడీ అనుకూల వార్తలు, డిబేట్లతో మిథ్యా ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక సోషల్‌ మీడియాలో మాత్రం అంతకు మించిన ప్రచారాలు, విశ్లేషణలు, ఊహకందని కథలు కనిపిస్తాయని చెప్తున్నారు. అన్ని పార్టీల్లోనూ సోషల్‌మీడియా టీమ్‌లు ఉన్నప్పటికీ.. బీజేపీలో మాత్రం అది చాలా ఎక్కువేనని విశ్లేషకులు అంటున్నారు.
దేశంలోని మోడీ పాలనలో మతోన్మాద హింస, జాత్యహంకార దాడులు, కులతత్వం, లింగ వివక్ష వంటివి తీవ్రమయ్యాయనీ, మణిపూర్‌ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని గుర్తు చేస్తున్నారు. ఆలయ నిర్మాణంపై ఉన్న శ్రద్ధ, సామాజిక సమస్యలను దూరం చేయటంలో మాత్రం మోడీ సర్కారుకు లేదని సామాజిక కార్యకర్తలు అంటున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్‌ అంశం తీవ్ర ప్రభావం చూపుతుందనీ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు గట్టి దెబ్బ తాకుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఎన్నికలు సమీపించే నాటికి పలు మిత్రపక్షాలు సైతం దూరమయ్యే అవకాశాలూ ఉన్నాయని అంటున్నారు. ఇక దక్షిణాదిలోనూ బీజేపీకి ఏ మాత్రమూ అవకాశాలు కనిపించటం లేవనీ, తమిళనాడులో ఇప్పటికే అన్నాడీఎంకేకు కాషాయపార్టీ దూరమైందని, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాస్ట్రాల్లో ఆ పార్టీకి కనీసం చోటే లేదని విశ్లేషకులు చెప్తున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో బీజేపీ కష్టకాలాన్ని ఎదుర్కోనున్నదని అంటున్నారు. ఈ ఎన్నికల్లో సంకీర్ణ రాజకీయాలు అనేక ప్రధాన పార్టీలకు కీలకం కానున్నాయని అంచనా వేస్తున్నారు.