– బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అవగాహన లేకుండానే కంటోన్మెంట్ పరిధిలో డబుల్ డెక్కర్ కారిడార్‌ను కాదనీ, ఎలివేటెడ్ కారిడార్ కోసం సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారని బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్ విమర్శించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం లోక్‌సభ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే రేవంత్ రెడ్డి ఎత్తుగడ వేశారని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ ఎన్నో ప్రయత్నాల ఫలితంగా కేంద్ర రక్షణ శాఖ భూములు ఇవ్వడానికి అంగీకరించిందని గుర్తుచేశారు. కంటోన్మెంట్ భూముల విషయంలో చిక్కులు విప్పేందుకు మాజీ మంత్రి కేటీఆర్ కేంద్రంలో మంత్రులు సుష్మ స్వరాజ్ నిర్మల్ సీతారామన్, రాజనాథ్ సింగ్ తదితరులను కలిశారని తెలిపారు. దీంతో కేంద్రం గతేడాది ఆగస్టు 23న రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు అంగీకరించిందని చెప్పారు. ఈ విషయంపై కంటోన్మెంట్ బోర్డు నిర్వహించిన సమావేశానికి స్థానిక ఎంపీగా రేవంత్ రెడ్డి హాజరు కాలేదని విమర్శించారు. ఎన్ని భూములు కావాలనే విషయంలో కూడా రేవంత్ రెడ్డికి అవగాహన లేదని ఎద్దేవా చేశారు. బీజేపీతో బీఆర్‌ఎస్ ఘర్షణ పడినందునే ప్రాజెక్టుల రాలేదని విమర్శిస్తున్న రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్‌ఎస్ కుమ్మక్కయ్యారని ఎందుకు ఆరోపిస్తున్నారని ప్రశ్నించారు.