రాష్ట్రానికి కోకాకోలా మరిన్ని పెట్టుబడులు

– మంత్రి కేటీఆర్‌తో ఆ సంస్థ ఉపాధ్యక్షులు జేమ్స్‌ మేక్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కోకాకోలా సంస్థ నిర్ణయించింది. తాజాగా తన అదనపు పెట్టుబడుల ప్రణాళికలను మంత్రి కేటీఆర్‌కు వివరించింది. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్‌తో ఆ సంస్థ ఉపాధ్యక్షుడు జేమ్స్‌ మేక్‌ గ్రివి ఈమేరకు శనివారం సమావేశమయ్యారు. సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌ వద్ద సంస్థకు ఉన్న భారీ బాటిలింగ్‌ ప్లాంట్‌ విస్తరణకు గతంలోనే రూ.100 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టామని తెలిపారు. దీనికి అదనంగా సిద్దిపేట జిల్లాలో రూ.1,000 కోట్లతో నూతన బాటిలింగ్‌ ప్లాంట్‌ నిర్మాణానికి.. ఏప్రిల్‌ నెల 22న రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఎంవోయూ కుదుర్చుకున్నట్టు పేర్కొన్నారు. వ్యాపార వృద్ధిని దృష్టిలో ఉంచుకుని అదనంగా మరో రూ.647 కోట్లను ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సిద్దిపేట జిల్లా ప్లాంట్‌లో పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ ప్లాంట్‌ డిసెంబర్‌ 24లోగా పూర్తి అవుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. వరంగల్‌ లేదా కరీంనగర్‌లో రెండో నూతన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని సంస్థ ప్రకటించింది. నూతన తయారీ ప్లాంట్‌ పెట్టుబడితో కలిపి దాదాపుగా రూ.2,500 కోట్లకుపైగా పెట్టుబడులను పెట్టినట్టు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా కోకాకోలా తన పెట్టుబడులను రెట్టింపు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం పట్ల మంత్రి కేటీఆర్‌ ఆ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు.
హరితహారం ఓ మహోన్నత కార్యం : చైర్మెన్‌ గుత్తా
కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాష్‌, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్‌ రావుతో కలిసి తెలంగాణ శాసన మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి మొక్కలు నాటారు. అనంతరం సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హరితహారం అనే మహౌన్నత కార్యక్రమని చెప్పారు. తెలంగాణలో అటవీ విస్తీర్ణం, పచ్చదనం బాగా పెరిగిందన్నారు. రాష్ట్రాన్ని ఆకుపచ్చని రాష్ట్రంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌ దక్కిందని తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ఎంతో గొప్పగా అభివృద్ధిని సాధించిందన్నారు.ఈ కార్యక్రమంలోఅసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వి. నరసింహా చార్యులు, బీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యదర్శి రమేష్‌రెడ్డి, నల్లగొండ జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ పాశం రాంరెడ్డి, గుత్తా వెంకట్‌ రెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌ చైర్మెన్‌ గుత్తా అమిత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.