ఈఎన్‌టీ ఆస్పత్రిలో 500 మంది చిన్నారులకు కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు

– ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌
నవతెలంగాణ -సుల్తాన్‌ బజార్‌
అప్పుడే పుట్టిన శిశువులకు నియోనేటల్‌ పరీక్ష ద్వారా వినికిడి సమస్యను గుర్తించవచ్చని కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ టి.శంకర్‌ తెలిపారు. ఈఎన్‌టీ ఆస్పత్రిలో 500 మంది చిన్నారులకు కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు పూర్తయిన సందర్భంగా ఆదివారం కోఠి ఈఎన్‌టీ హాస్పిటల్‌ ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన సమావేశంలో సర్జరీ చేసుకున్న చిన్నారులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శంకర్‌ మాట్లాడుతూ చిన్ననాటి నుంచి వినికిడి సమస్య ఉన్న 500 మందికి పైగా చిన్నారులకు ఇప్పటివరకు కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు సర్జరీలు పూర్తి చేసామన్నారు. సర్జరీ అనంతరం చిన్నారులకు వినికిడి యంత్రాన్ని అమర్చి ప్రత్యేక టీచర్ల ద్వారా స్పీచ్‌ థెరపీ అంది స్తున్నామన్నారు. ఇలాంటి సమస్యలు ఎక్కువగా మేనరికం, వంశపారంలో ఉంటే వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీ తర్వాత 99శాతం చిన్నారులు మామూలు పిల్లల వలె స్కూలుకు వెళ్తారని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా, వివిధ స్కీమ్‌ల్లో ఉచితంగా ఈ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఆర్‌ఎంఓ డాక్టర్‌ జయ మనోహరి, డాక్టర్‌ ఎల్‌ సుదర్శన్‌ రెడ్డి, డాక్టర్‌ సంపత్‌ కుమార్‌ సింగ్‌, ఆడియాలజిస్ట్‌ డాక్టర్‌ డీకే వీణ, అనిస్తీసియా డాక్టర్‌ ఉమా, నర్సింగ్‌ సూపరిం టెం డెంట్‌ కస్తూరి దేవి, హెడ్‌ నర్స్‌ గౌరీ దేవి, చిన్నపిల్లల తల్లిదండ్రులు, ఆస్పత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.