– మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు
– ఆదివారం నుండే ఎన్నికల వ్యయం లెక్కింపు
– ముందస్తు అనుమతి లేనిదే ర్యాలీలు, సమావేశాలు నిషేధం
– కలెక్టర్ హరిచందన దాసరి
– ప్రజలు పూర్తి సహకారం అందించాలి
– 50 వేలకు మించితే ఆధారాలు తప్పనిసరి
– నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
– ఎస్పీ చందనా దీప్తి
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్ : కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి శనివారం నుండి అమలులోకి వచ్చినట్లు జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. ఆదివారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పార్లమెంట్ ఎన్నికలపై మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ను ఆమె తెలియజేస్తూ ఏప్రిల్ 18 న పార్లమెంట్ ఎన్నికల గజిట్ నోటిఫికేషన్ విడుదలవుతుందని, ఏప్రిల్ 25 న నామినేషన్ దాఖలు చేసేందుకు చివరి తేదీ గా నిర్ణయించడం జరిగిందని, 26 న నామినేషన్ల పరిశీలన, 29 న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని, పార్లమెంటు ఎన్నికల పోలింగ్ మే 13 న జరుగుతుందని, జూన్ 4 వ తేదీన దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుందని ఆమె వెల్లడించారు. నల్గొండ జిల్లాలో మొత్తం 1766 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, 46 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించామని, 30 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు, 30 మహిళా నిర్వహణ పోలింగ్ కేంద్రాలు, 6 యూత్ పోలింగ్ కేంద్రాలు, మరో 6 పిడబ్ల్యుడి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. 14.9 లక్షల ఓటర్లు ఉండగా, 7.35 లక్షల పురుష ఓటర్లు, 7.54 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారని, కొత్తగా 52,000 మంది ఓటర్లు నమోదయ్యారని తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఆదివారం నుండి ఎన్నికల వ్యయం లెక్కలోకి వస్తుందని, ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాల వంటివి నిర్వహించకూడదని తెలిపారు. ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు ఎస్ ఎస్ టి, వి ఎస్ టి బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదులను సి-విజిల్ ద్వారా 1950 నెంబర్ కు తెలియజేయాలని, ఎన్నికల సక్రమ నిర్వహణకు సుమారు 20 నోడల్ టీమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని తు.చ తప్పకుండా అమలు చేయనున్నట్లు ఆమె తెలిపారు.
జిల్లా ఎస్పీ చందనా దీప్తి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ ఎన్నికలలో పోలీస్ తరఫున ఎక్కువ తనిఖీలు చేపట్టడం జరుగుతుందని, సి-విజిల్ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని, ముందస్తు అనుమతి లేకుండా సమావేశాలు ర్యాలీలు నిర్వహించకూడదని, సువిధ ద్వారా ముందస్తుగానే వీటన్నిటికీ అనుమతులు తీసుకోవాలని తెలియజేశారు. ఎన్నికల సమయంలో ఎవరైనా 50 వేలకు మించి నగదును తీసుకు వెళ్ళవలసి వస్తే ఖచ్చితమైన ఆధారాలను వెంట ఉంచుకుని తీసుకువెళ్లారని తెలిపారు. ఎన్నికల సందర్భంగా స్వాధీనం చేసుకున్న నగదును జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ఫిర్యాదుల కమిటీ ద్వారా విడుదల చేయడం జరుగుతుందని, సరైన సాక్ష్యాలు చూపించిన తర్వాత విడుదల చేస్తారని తెలిపారు. ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సీసీ కెమెరాలు పెంచడం జరిగిందని, ఎన్నికల్లో శాంతిభద్రతలకు గట్టి బందోబస్తును ఏర్పాటు చేసేందుకు ప్రణాళికను రూపొందించినట్లు ఆమె పేర్కొన్నారు.ఈ సమావేశంలో డిఆర్ఓ డి .రాజ్యలక్ష్మి, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, సమాచార శాఖ సహాయ సంచాలకులు యు. వెంకటేశ్వర్లు, మీడియా రిలేషన్స్ నోడల్ అధికారి, ఇండస్ట్రీస్ జిఎం. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.