కాక పుట్టించిన కాగ్‌

Cog born from Kakaనా ఖావుంగా… నా ఖానేదూంగా! అధికారంలోకి రాక ముందు మన మోడీ డైలాగిది. ఇప్పుడు మచ్చలు, మరకలు కాదు, తారు డబ్బాలో ముంచి లేపినట్లుంది మోడీ సర్కారు పద్ధతి. తమది అవినీతి మచ్చ అంటని ప్రభుత్వమని ప్రచారం చేసుకోవడంలో మోడీకి మించిన వారు లేరు. అందుకే ఇప్పుడు కాగ్‌ అధికారులు తన పాలనలోని అవినీతి బతుకులను బయటపెట్టారనే కడుపుమంట ఆపుకోలేకపోతున్నాడు. స్వచ్ఛత ముసుగులో వేలకోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వ పెద్దల భాగోతాన్ని కాగ్‌ అధికారులు వెలికితీశారు. ఆ లెక్కలను ప్రజల ముందు పెట్టారు. అది భరించలేక అధికారులను వేధింపులకు గురి చేస్తున్నారు. వారిపై బదిలీ వేటు వేశారు.
ద్వారక ఎక్స్‌ప్రెస్‌ వే, భారత్‌ మాల, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి పథకాల్లో దాదాపు రూ.3,600 కోట్ల అవినీతి జరిగింది. వీటిని లెక్కలతో సహా తేల్చిన కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) విభాగంలోని అధికారులపై మోడీ సర్కారు పగ బట్టింది. ఈ మూడు పథకాలతోపాటు కేంద్రం చేపట్టిన అనేక మౌలిక వస తుల పథకాల్లో అంచనాలను అమాంతం పెంచి ఎలా దోచుకొన్నారో కాగ్‌ నివేదికను రూపొందించింది. దాన్ని గత పార్లమెంటు సమావేశాల్లో సమర్పించింది. దీంతో మోదీ సర్కారు బండారం దేశానికి తెలిసిపోయింది. దాంతో ఈ రిపోర్టును తయారుచేసిన అపూర్వ సిన్హా, దత్తప్రసాద్‌ సూర్యకాంత్‌ శిర్సత్‌, అశోక్‌ సిన్హా అనే సీనియర్‌ అధికారులను గుట్టు చప్పుడు కాకుండా బదిలీ చేసేశారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిజాలు బయటపెట్టిన అధికారులపై కేంద్రం బెదిరింపులకు దిగుతుందని మండిపడ్డాయి. బదిలీ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. అక్రమాలపై దర్యాప్తు జరిపిం చాలని కోరాయి. ఇవేవీ పట్టని కేంద్రం చిత్తశుద్ధితో పనిచేసే అధికారులను బదిలీ పేరుతో తలోమూల విసిరేసి తన కడుపు మంట చల్లార్చుకుంది.
ద్వారక ఎక్స్‌ప్రెస్‌ వే టెండర్లలో అధిక ధరలకు కాంట్రాక్టర్లకు కట్ట బెట్టారని కాగ్‌ తేల్చింది. వారి లెక్కల ప్రకారం అసలు ధర కంటే 1,400 శాతం అధికంగా కోట్‌ చేసిన కంపెనీకి టెండర్‌ కట్టబెట్టారు. కేంద్రం చేపట్టిన జాతీయ రహదారుల నిర్మాణ ప్రాజెక్టుల్లో రూ.3,600 కోట్ల అవినీతి జరిగిన విషయాన్ని నివేదిక కుండబద్ధలు కొట్టింది. భారత్‌ మాల పథకంలో కూడా అరవై శాతం అధిక ధరలకు కోట్‌ చేసిన కంపెనీకి టెండర్‌ కట్టబెట్టారని తేల్చింది. ఇక పేదలకు వైద్యం కోసం అమలుచేస్తున్న ఆయు ష్మాన్‌ భారత్‌ పథకమైతే మరీ దారుణం. ఈ పథకంలో లబ్ధిదారులని చెప్తున్నవారిలో ఏకంగా ఏడున్నర లక్షల మంది ఒకే ఫోన్‌నంబర్‌పై రిజిస్ట్రేషన్‌ చేసుకొ న్నారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ సొమ్మంతా అవినీతి పరుల ఖాతాల్లో చేరిపోయిందనే కదా!
ఆరోగ్య బీమా విషయంలోనూ ఇదే తంతు. 2.25 లక్షల మందికి శస్త్ర చికిత్స చేశామని చెప్పారు. అయితే చికిత్స చేసిన తేదీనీ రోగులను ఆసుపత్రి నుంచి పంపించిన తేదీ తర్వాత చూపించారు. అంటే దొంగ తనానికి కూడా కొన్ని నియమాలు ఉంటా యన్న ఇంగితం కూడా మన పాలకులకు లేకుండా పోయింది. రైల్వే మంత్రిత్వ శాఖకు కేటాయించిన ధనాన్ని దర్జాగా ఖర్చు పెట్టేశారు. ఈ విషయాలు కూడా కాగ్‌ నివేదికలో బయటపడ్డాయి. ఈ లెక్కలన్నీ చూస్తే మోడీ సర్కారు అవినీతి ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. వాస్త వానికి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు కాగ్‌ నివేదికలు పార్ల మెంటు గడప తొక్కకుండా అడ్డుకుంటున్నారు. అలాంటిది తమ అవినీతిని బయటపెట్టిన అధికారులను మోడీ ప్రభుత్వం ఎలా సహిస్తుంది?
ప్రస్తుతం కాగ్‌ అధిపతి గిరిశ్‌ చంద్ర ముర్ము గుజరాత్‌కు చెందిన ఉన్న తాధికారి. ఆయన మోడీకి, అమిత్‌ షాకు అత్యంత సన్నిహితుడు. అందుకే ఆయన్ని మాత్రం భద్రంగా కాపాడుకుంటున్నారు. ఆయన కింద పనిచేసి లొసుగులు ఎత్తి చూపిన అధికారులను మాత్రం బదిలీ చేశారు. ఎందుకంటే తమది మచ్చలేని పాలన అనే భ్రమలో ప్రజలు ఉంటేనే తన కూర్చీని కాపాడుకోవడం సాధ్యమని మన ప్రధానికి బాగా తెలుసు. దీని కోసం మరో పూల్వామాను సృష్టించినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదు.
యూపీఏ హయాంలో వినోద్‌ రారు కాగ్‌ అధిపతిగా ఉన్న సమయంలో 2జి, కామన్వెల్త్‌ క్రీడల కుంభకోణాల్లాంటివి రోజు కొకటి వెలికి వచ్చేవి. ఆ కాలంలో జరిగిన మరో ఘోరమైన అవి నీతి కోల్‌గేట్‌ కుంభకోణం. వీటన్నింటినీ అడ్డుపెట్టుకుని అధి కారంలోకి వచ్చిన మోడీ మరింత అవినీతికి పాల్పడుతున్నాడు. ఇటీవల పంజాబ్‌ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ దిగుమతి చేసుకునే బొగ్గు అదానీ పోర్టుల నుండే రావాణా జరగాలనే నిబంధన పెట్టారు. అలాగే అదానీకే బొగ్గు కాంట్రాక్ట్‌ ఇవ్వాలంటూ భారత సీఎంఓ శ్రీలంక ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అధికారిపై ఒత్తిడి తెచ్చింది. అంతే కాదు మోడీ మొదటిసారి ఆస్ట్రేలియా వెళ్ళినపుడు ఆయనతో పాటు అదానీని కూడా వెంటబెట్టుకెళ్ళి అక్కడి బొగ్గు గనుల కాంట్రాక్ట్‌ ఇప్పించి వచ్చాడు. ఇలా జనం కడుపులు కొట్టి తన ప్రియ మిత్రునికి దేశాన్ని దోచిపెడుతున్నాడు మోడీ. తమ సొమ్మును ఇంతలా లూఠీ చేస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటారో? లేదా రాబోయే ఎన్నికల్లో తమ ఓటుతో బుద్ధి చెప్తారో వేచి చూడాలి.