శీతల పద్మం

Cold lotusసూర్యుడికి ఎంత చలిగా ఉందో
ఎనిమిదయినా
మంచు దుప్పటి వదులుత లేడు

వీధులన్నీ రెక్కలు ముడుచుకుని
గజగజ వణుకుతున్నయి
పెద్దపులిని చూసినట్టు

ఆ చెట్టూ ఈ చెట్టూ
తాత వెలిగించిన చలిమంటకు
వెచ్చగా వొళ్ళు కాగుతున్నయి

అంత చలి లోనూ
వాకిలి
ముగ్గు నగలు సింగారించుకుని
పెళ్లికూతురులా ముస్తాబు అయింది

పొయ్యి మీది నీళ్ళ గిన్నె
సల సలా మసులుతున్నది
అంట్లు
అమ్మ చేతిలో తలస్నానమాడుతున్నయి

అమ్మకు ఎండ లేదూ వానా లేదు
నేను నిద్ర లేచే వరకూ
అమ్మ నిద్రపోయిందే లేదు

పక్క వీధి సందులో
సిగరెట్‌ తాగుతున్న నాయిన లాగా
అమ్మంటే
చలికి కూడా ఎంత భయమో.

– గజ్జెల రామకష్ణ
8977412795