సహకారం.. బహుదూరం

– సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, యంత్రాల ఉసేలేదు
– ఐదేళ్లుగా రైతులకు అవస్థలు
– కొత్త ప్రభుత్వం పైనే రైతుల ఆశలు
నవతెలంగాణ – మల్హర్ రావు
వ్యవసాయమే జీవనోపాధిగా ఎంచుకున్న రైతులకు గత ప్రభుత్వంలో సహకారం కొరవడింది. సాగు పరికరాలు,యంత్రాలపై రాయితీ ఎత్తివేయడంతో చిన్న,సన్నకారు రైతులకు కష్టతరంగా మారింది.వెన్నంటి ఉండే సహకార సంఘాల ప్రోత్సాహం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రాయితీపై సరఫరా చేసే సాగు సామగ్రి తదితరాల కోసం ఐదేళ్లుగా ఎదురుచూపులే మిగిలాయంటున్నారు. ఏటా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం సహకార సంఘాల ద్వారా సబ్సిడిపై అందజేసే యంత్రాలు, యంత్ర పరికరాలు, ఎరువులు, విత్తనాల ఊసే లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.కనీసం కొత్త ప్రభుత్వమైన తమ వైపు చూడాలని, సహకారం అందించాలని కోరుతున్నారు.
మండలంలో 9,851 మంది రైతులున్నారు.వర్షాకాలంలో 22,500 ఎకరాల్లో వరి, మిర్చి,పత్తి తోపాటు వివిధ రకాల పంటలు సాగు చేస్తుంటారు.కాగా సాగుకు సంబంధించిన సహకారంపై ఇప్పటికి ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో మండల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదివరకు సహకార సంఘాలు సాగు పద్ధతులు, అవసరమైన యాంత్రపరికరాలు,నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై తదితరాల్లో రైతులకు అండగా ఉండేవి. కానీ సొసైటీలు అవేవి ఇవ్వడం లేదు. వాటిపై ప్రభుత్వం రాయితీ ఎత్తివేసింది.దీంతో మండల పరిధిలోని రైతులు తమకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కోసం ప్రయివేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.నాణ్యత లేని ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ నష్టపోతున్నారు. పంట ఉత్పత్తులను విక్రయిస్తే వచ్చే ఆదాయం కంటే ఖర్చు అధికం కావడంతో రైతులు అప్పులపాలవుతున్నారు.సహకార సంఘాలు, వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు కొరవడి రైతులు నష్టపోతున్నారు. ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి అధిక దిగుబడి, సేంద్రియ సేద్యం వాటి పద్ధతులు, ఎరువుల వాడకం లాభసాటి పంటలు తదితర అంశాలపై సలహాలు,సూచనలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.అదేవిధంగా అదునూతన సాగు పరికరాలు, యంత్రాలు, ట్రాక్టర్లు, పంపు సెట్లు తదితర వాటి ధరలు రూ.లక్షల్లో ఉంటాయని వాటిని సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు చేసి కనీసం అద్దెకు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
విత్తనాలు అందించాలి…అక్కల బాపు యాదవ్ ….రైతు సంఘం నాయకుడు.
మార్కెట్ లో నకిలీ విత్తనాల దందా ఎక్కువైంది.చిన్న సన్నకారు రైతులు అప్పులు తెచ్చి వ్యాపారుల మాటలు నమ్మి నాసిరకం విత్తనాలు కొనాల్సి వస్తోంది. దీంతో దిగుబడి లేక రైతులు నష్టపోతున్నాం.వ్యవసాయ అధికారుల ద్వారా నాణ్యమైన ఎరువులు,విత్తనాలు, పురుగుల మందులు సబ్సిడీలో పంపిణీ చేయాలి.