కుప్పకూలి..!

– విశాఖలో భారత్‌ దారుణ ఓటమి
– బ్యాట్‌తో, బంతితో ఘోర వైఫల్యం
– స్టార్క్‌కు ఐదు వికెట్లు, మార్ష్‌ మెరుపులు
తీరంలో టీమ్‌ ఇండియా చేతులెత్తేసింది. ఎడమ చేతి వాటం పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ (5/53) దెబ్బకు 117 పరుగులకే కుప్పకూలారు. బ్యాటింగ్‌ పిచ్‌పై ఆసీస్‌ పేసర్‌ విజృంభణతో ఆతిథ్య జట్టు 26 ఓవర్లలోనే ఆలౌట్‌ కాగా.. స్వల్ప లక్ష్యాన్ని కంగారూలు ఊదేశారు. ఓపెనర్లే 11 ఓవర్లలో బాదేసి సిరీస్‌ను 1-1తో సమం చేశారు. వన్డే సిరీస్‌ నిర్ణయాత్మక పోరు బుధవారం చెన్నైలో జరుగనుంది.
నవతెలంగాణ-విశాఖపట్నం
మిచెల్‌ స్టార్క్‌ (5/53) ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. బ్యాటింగ్‌ పిచ్‌పై భారత బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. సీన్‌ అబాట్‌ (3/23), నాథన్‌ ఎలిస్‌ (2/13) సైతం మెరవటంతో తొలుత భారత్‌ 117 పరుగులకే కుప్పకూలింది. అక్షర్‌ పటేల్‌ (29 నాటౌట్‌, 29 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లి (31, 35 బంతుల్లో 4 ఫోర్లు) భారత్‌కు గౌరవప్రద స్కోరు అందించారు. ఓపెనర్లు మిచెల్‌ మార్ష్‌ (66 నాటౌట్‌, 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), ట్రావిశ్‌ హెడ్‌ (51 నాటౌట్‌, 30 బంతుల్లో 10 ఫోర్లు) అజేయ అర్థ సెంచరీలతో మెరవటంతో 11 ఓవర్లలోనే ఆస్ట్రేలియా లాంఛనం ముగించింది. మరో 234 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. 37 ఓవర్లలో ముగిసిన వన్డే మ్యాచ్‌లో గెలుపొందిన ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఐదు వికెట్లతో విశాఖ వన్డేను ఏకపక్షం చేసిన ఆసీస్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు.
బ్యాటర్లు బోల్తా.. : టాస్‌ నెగ్గిన ఆస్ట్రేలియా ఛేదనకు మొగ్గు చూపించింది. దీంతో భారత్‌ తొలుత బ్యాటింగ్‌కు వచ్చింది. విశాఖలో తిరుగులేని రికార్డున్న భారత్‌ ఫేవరేట్‌గా బరిలో నిలిచినా.. లెఫ్ట్‌ ఆర్మ్‌ సీమర్‌ మిచెల్‌ స్టార్క్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఎడమ చేతి వాటం పేసర్లను ఎదుర్కొవటంలో ఏండ్లుగా ఇబ్బందులు పడుతున్న టీమ్‌ ఇండియా విశాఖలో మరోసారి ఆ బలహీనత బయటపెట్టుకుంది. ఇన్నింగ్స్‌ మూడో బంతికే యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (0)ను అవుట్‌ చేసిన స్టార్క్‌. ఐదో ఓవర్లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (13) కథ ముగించాడు. సూర్య కుమార్‌ యాదవ్‌ (0), కెఎల్‌ రాహుల్‌ (9)లను సైతం పది ఓవర్లలోపే అవుట్‌ చేసిన స్టార్క్‌ భారత్‌ను 5/49తో పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు. విరాట్‌ కోహ్లి (31) సావధానంగా బ్యాటింగ్‌ చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. హార్దిక్‌ పాండ్య (1) చేతులెత్తేయగా.. రవీంద్ర జడేజా (16) వాంఖడే ఫామ్‌ కొనసాగించలేదు. టెయిలెండర్లలో అక్షర్‌ పటేల్‌ (29 నాటౌట్‌) మరోసారి జట్టును ఆదుకున్నాడు. రెండు సిక్సర్లు, ఓ బౌండరీతో భారత్‌కు మూడంకెల స్కోరు అందించాడు. మహ్మద్‌ సిరాజ్‌ (0) వికెట్‌తో స్టార్క్‌ వన్డేల్లో ఏకంగా తొమ్మిదో సారి ఐదు వికెట్ల ప్రదర్శన పూర్తి చేశాడు. భారత ఇన్నింగ్స్‌లో నలుగురు బ్యాటర్లు సున్నా పరుగులకే వికెట్‌ కోల్పోయారు. 26 ఓవర్లలోనే భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆసీస్‌ బౌలర్లలో సీన్‌ అబాట్‌ (3/23), నాథన్‌ ఎలిస్‌ (2/13) సైతం రాణించారు.
ఓపెనర్లే కొట్టేశారు : 118 పరుగుల ఛేదనలో ఆసీస్‌కు భారత బౌలర్లు సవాల్‌ విసురుతారనే అంచనాలు కనిపించాయి. కానీ, పిచ్‌ నుంచి పేసర్లకు అదనపు సహకారం ఏమీ దక్కలేదు. దీంతో ఆసీస్‌ ఓపెనర్లు వీర విహారం చేశారు. ఓపెనర్లు రెండు ఎండ్‌ల నుంచి దంచి కొట్టారు. మిచెల్‌ మార్ష్‌ 28 బంతుల్లో అర్థ సెంచరీ చేయగా.. ట్రావిశ్‌ హెడ్‌ 29 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేశాడు. తొలి వికెట్‌కు అజేయంగా 121 పరుగులు జోడించిన ఓపెనర్లు 11 ఓవర్లలోనే లాంఛనం ముగించారు. భారత బౌలర్లలో ఎవరూ ఆసీస్‌ ఓపెనర్లను ఇబ్బంది పెట్టలేకపోయారు. 100 ఓవర్ల మ్యాచ్‌ 37 ఓవర్లలోనే ముగియటంతో అభిమానులు సైతం తీవ్ర నిరాశకు లోనయ్యారు!.
స్కోరు వివరాలు :
భారత్‌ ఇన్నింగ్స్‌ : రోహిత్‌ (సి) స్మిత్‌ (బి) స్టార్క్‌ 13, గిల్‌ (సి) లబుషేన్‌ (బి) స్టార్క్‌ 0, విరాట్‌ కోహ్లి (ఎల్బీ) ఎలిస్‌ 31, సూర్యకుమార్‌ యాదవ్‌ (ఎల్బీ) స్టార్క్‌ 0, కెఎల్‌ రాహుల్‌ (ఎల్బీ) స్టార్క్‌ 9, హార్దిక్‌ పాండ్య (సి) స్మిత్‌ (బి) అబాట్‌ 1, రవీంద్ర జడేజా (సి) అలెక్స్‌ (బి) ఎలిస్‌ 16, అక్షర్‌ పటేల్‌ నాటౌట్‌ 29, కుల్దీప్‌ యాదవ్‌ (సి) హెడ్‌ (బి) అబాట్‌ 4, షమి (సి) అలెక్స్‌ (బి) అబాట్‌ 0, సిరాజ్‌ (బి) స్టార్క్‌ 0, ఎక్స్‌ట్రాలు : 14, మొత్తం : (26 ఓవర్లలో ఆలౌట్‌) 117.
వికెట్ల పతనం : 1-3, 2-32, 3-32, 4-48, 5-49, 6-71, 7-91, 8-103, 9-103, 10-117.
బౌలింగ్‌ : మిచెల్‌ స్టార్క్‌ 8-1-53-5, కామెరూన్‌ గ్రీన్‌ 5-0-20-0, సీన్‌ అబాట్‌ 6-0-23-3, నాథన్‌ ఎలిస్‌ 5-0-13-2, ఆడం జంపా 2-0-6-0.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ : ట్రావిశ్‌ హెడ్‌ నాటౌట్‌ 51, మిచెల్‌ మార్ష్‌ నాటౌట్‌ 66, ఎక్స్‌ట్రాలు : 4, మొత్తం : (11 ఓవర్లలో) 121.
బౌలింగ్‌ : మహ్మద్‌ షమి 3-0-29-0, మహ్మద్‌ సిరాజ్‌ 3-0-37-0, అక్షర్‌ పటేల్‌ 3-0-25-0, హార్దిక్‌ పాండ్య 1-0-18-0, కుల్దీప్‌ యాదవ్‌ 1-0-12-0.