నవతెలంగాణ-భిక్కనూర్ : ఢిల్లీలో నిర్మిస్తున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బిల్డింగ్ నిర్మాణానికి ప్రజా విరాళాల సేకరణ నిర్వహించడం జరుగుతుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు తెలిపారు. సోమవారం భిక్కనూరు పట్టణంలో వ్యాపార సముదాయాల వద్ద విరాళాలు సేకరించారు. అనంతరం ముఖ్యఅతిథిగా హాజరైన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ రాములు, రాష్ట్ర సహాయ కార్యదర్శి పద్మ మాట్లాడుతూ కర్షకులు, కార్మికుల సమస్యలపై తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు. పోడు భూములు, ఇండ్ల స్థలాలు, సాగు భూముల కోసం, పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ప్రజల నుండి సేకరించిన విరాళాలతోనే భవన నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సవ్వ, చంద్రకళ, అర్జున్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.