బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థకే కేటాయించాలని కోరుతూ సీపీఐ(ఎం) జన్నారం మండల నాయకులు ప్రజల నుంచి సంతకాలను సేకరించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మంగళవారం మండలం మురిమడుగు గ్రామంలో సీపీఐ(ఎం) మండల నాయకులు కొండగొర్ల లింగన్న ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. రాష్ట్రానికి ఆయువుపట్టుగా ఉన్న సింగరేణి సంస్థను కాపాడుతూ ఆ సంస్థకే బొగ్గు బ్లాకులను కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని, వేలంపాట రద్దు చేయాలని, ప్రైవేటుకు అప్పగించవద్దని, ప్రైవేటుకు అప్పగిస్తే నిరుద్యోగ సమస్య పెరిగి,సింగరేణి ఆధారంగా అభివృద్ధి అయిన పట్టణాలన్నీ నష్టపోతాయన్నారు. వేల కోట్ల లాభాలు గడిస్తున్న సింగరేణి సంస్థ, ప్రతి సంవత్సరము కేంద్రానికి, రాష్ట్రానికి డివిడెంట్ రూపంలో ఫండ్ చెల్లిస్తుందన్నారు. ఎటువంటి పెట్టుబడి లేకుండానే ఆదాయం సమకూర్చుతున్న సంస్థను రక్షించుకోవలసిన బాధ్యత ప్రజలందరిదన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.