సామూహిక సవాళ్లు

Sampadakiyamకొన్నిసార్లు వ్యక్తులకు సవాళ్లొస్తుంటాయి. నాయకుడి చుట్టూ నిర్మించిన పార్టీల్లో ఇది సర్వసాధారణం. సమిష్టి నిర్ణయాలే అమలయ్యే పార్టీలకూ సవాళ్లుంటాయి. కోవిడ్‌ లాంటి మహమ్మారులు కమ్ముకున్న పుడు దేశాలకు సవాళ్లుంటాయి. కాని యావత్‌ తెలంగాణ సమాజానికి, దాన్లోని నాలుగు కోట్ల మంది జనానికి సామూహికంగా సవాళ్లు రావడం ఒక ప్రత్యేక సందర్భమే! ఆకాశంలోని నక్షత్రాలను కోసుకొచ్చి మన గ్రామ సీమల్లో ముగ్గులద్దుతామన్న పార్టీ మాటలు విరోధాభాసాలంకారానికి నిలువెత్తు నిదర్శనాలుగా నిలిచాయి. కన్యాశుల్కంలో వెంకమ్మ గారి నిష్ఠూరపు మాటలు ”అదిగో పసుపు, ఇదిగో ముసుగు”ల సామ్యం చాలా మందిని కలిచి వేశాయి. ప్రయణారంభాన్ని మరిచిపోతే గమనం అర్థం కాదు, గమ్యం శిథిలమవుతుంది. అలానే అయ్యింది కూడా!
ఇది రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌ల మధ్య సమస్య కాదు, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య సమస్య అసలే కాదు. విధానాలకు సంబంధించిన సమస్య. 2014 కంటే ముందు కాంగ్రెస్‌ అవలంభించిన విధానాలనే ఆ తర్వాత టీఆర్‌ఎస్‌, ఇప్పటి బీఆర్‌ఎస్‌ అవలంభించింది. లేదా కొనసాగించింది. అందుకే అక్కడికే చేరింది. 1991 – 92లో పి.వి, మన్మోహన్‌ ద్వయం ప్రారంభించిన నయా ఉదారవాద విధానాలు నిరుద్యోగాన్ని, వ్యవసాయ సంక్షోభాన్ని పెంచాయి. రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. నేటికీ దేశంలో అతిపెద్ద ఉపాధి కేంద్రం వ్యవసాయమే. గ్రామీణ నిరుద్యోగం కుప్పలు తెప్పలుగా పెరిగింది. దీని పరిష్కారానికే 2014లో మోడీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలన్నాడు. వ్యవసాయ సంక్షోభం పరిష్కారించాలంటే ఒకటిన్నర రెట్లు పంటకు ఆదాయమొచ్చేలా చేస్తామన్నాడు. వీటి పరిష్కారానికే 2014లో కేసీఆర్‌ నీళ్లు, నియామకాలన్నాడు.
జనం రోసిన ఆ విధానాలవలంభిస్తే తెలంగాణ లో ఉపాధి అవకాశాలు మెరుగవలేదు. నియామ కాలు ‘హళ్లికి హళ్లి, సున్నకి సున్న’గా తేలాయి. 1983 నుండి 2018 వరకు యువత ఉపాధి అవకాశాలు పెరిగినట్లు దాఖలాల్లేవు. తాజాగా అజీమ్‌ప్రేమ్‌జీ విశ్వ విద్యాలయం వారి ‘స్టేట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఇండియా 2023’ నివేదిక ఉపాధి అవకాశాల అధ్వాన్న స్థితినే తెలియ జేస్తున్నది. పైగా కార్మికుల నిజ వేత నాలు పడిపోవడం మరొక కీల కాంశం. ఉపాధి హామీ పనుల్లో పెద్ద ఎత్తున కేంద్రం కోత పెడుతున్నది. దానిపై ఇంతకాలం నోరెత్తలేదు బీఆర్‌ఎస్‌. అది బీజేపీతో లాలూచీ కుస్తీలో అంతర్భాగమో కాదో కేసీఆర్‌ తేల్చాలి.
కోట్లాది జనం చేసిన పోరాటాల వల్ల తెలంగాణ సిద్ధించింది. దానికి కర్త, కర్మ, క్రియా తానేనన్న అహంకారంతో కేసీఆర్‌ ప్రవర్తించారు. తనని విమర్శిస్తే తెలంగాణను విమర్శించినట్లేనంటూ ఆయన తాబేదార్లంతా ఎగిసి పడేవారడ్లు. గులాబీ దళాలు మరిచిపోయిన అంశం, లేదా విస్మ రించిన అంశమేమంటే తెలంగాణ సాధన ఒక (ఎన్డ్‌) ముగింపు కాదు. నాలుగు కోట్ల తెలంగాణా వాసుల సముద్ధరణకు అది ఒక సాధనం (మీన్స్‌). ఉత్తరాన గోదావరి, దక్షి ణాన క్రిష్ణ నదులున్న ప్రాంతం మన తెలం గాణ. ఇనుము, బొగ్గు, సున్నపురాయి, బా క్సైట్‌ వంటి ఖనిజాలనేకం. క్రిష్ణానది పొడు గునా కోదాడ నుండి విష్ణుపురం వరకు సిమెంటు పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. రైలు, రోడ్‌ రవాణాని విస్తరించగలిగితే అభి వృద్ధి వేగంగా జరుగుతుంది. దీనికి అడ్డుపడే కేంద్ర ప్రభుత్వ విధానాలపై యుద్ధం చేయాలి. ఆ పని చేయకుండా పెద్దనోట్ల రద్దుకు, జీఎస్‌టీకి భజన చేస్తూ కొంతకాలం కాలక్షేపం చేసింది బీఆర్‌ఎస్‌. ఆ రెంటి దెబ్బకు కునారిల్లిన ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ లు నేటికీ కోలుకోలేదు.
60 శాతం పైగా వలస కార్మికులతో పని చేయించుకుంటూ పరిశ్రమల యజమానులు కోట్ల రూపాయల లాభాలు సంపా దించుకుంటున్నారు. నేడు స్థానికులకే ఉద్యోగాలన్న డిమాండు రాష్ట్రమంతా మార్మోగుతున్నది. వ్యవసాయంతో సహా అన్ని పను ల్లో యాంత్రీకరణ పెరిగిపోయింది. ఇక ‘నియామకాల’న్న అంశ మే అటకెక్కింది. వ్యవసాయాధారిత పరిశ్రమల స్థాపనకున్న అవకాశాలను పాలకులు పట్టించుకోకపోవడం పెద్ద సవాలు. టిఎస్‌ఐడీసీ ద్వారా 28 ఇండిస్టీయల్‌ పార్కులేర్పాటు చేసినా అవి నడిపించింది లేదు. కొలువులొచ్చిందీ లేదు.
నైజాము నవాబునే ఎదిరించి, వారి గడీలను కూల్చిన భూ మి మీద ఆత్మగౌరవం లేకుండా బతకదు తెలంగాణ. ఏకుగా వచ్చి మేకుగా మారిన పాలకుడి దర్శనం ఆ పార్టీ శాసన సభ్యు లకే కరువు. ఇక సామాన్యుల గతేంటి? ఇప్పుడు ప్రజలకు కనీ సం తమగోడు విన్నవించుకోగలిగామన్న సంతృప్తి గత నాలుగు రోజులుగా జ్యోతిబాఫూలే ప్రాంగణంలో మారుమోగుతున్న తీరే ఒక నిదర్శనం. అందుకే, సవాళ్లు వ్యక్తులకు కాదు.
ఇది వ్యక్తుల సమస్య కూడా కాదు. తెలంగాణ ప్రజల సమస్య, వాళ్ల జీవితాలకు సంబంధించిన సమస్య. ఈ సవాళ్లను సరిగా స్వీకరించి ప్రజలకు ఎలా ఉపయోగపడాలో కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించుకోవాలి.