ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్

– నేటి  సాయంత్రం నుండి ప్రచారం పరిసమాప్తం
– 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6  వరకు పోలింగ్
– పోలింగ్ పూర్తయ్యేంతవరకు మద్యంపై నియంత్రణ
– జిల్లా ఎన్నికల అధికారి  హరిచందన దాసరి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్గొండ పార్లమెంటు స్థానానికి మే 13 న పోలింగ్  నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని  జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరి చందన తెలిపారు. శుక్రవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పార్లమెంటు ఎన్నికలు, శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికపై మీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6  వరకు పార్లమెంట్ పోలింగ్ జరుగుతుందని, సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ కేంద్రం పరిధి లోని 100 మీటర్ల లోనికి వచ్చిన వాళ్లకి టోకెన్లు ఇచ్చి ఓటు వేయడానికి అవకాశం ఇస్తామని  తెలిపారు. ఇప్పటికే జిల్లా కేంద్రం నుండి అన్ని అసెంబ్లీ నియోజకవర్గలకు ఈవీఎం  లను పంపించామని, ఈనెల 12న  డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ల నుండి ఆయా పోలింగ్ స్టేషన్లకు ఎన్నికల సిబ్బందితోపాటు  ఈవీఎంలు చేరుకుంటాయని తెలిపారు. అభ్యర్థులు ఈనెల 11న సాయంత్రం తమ ప్రచారాలను నిలిపివేయాలని ప్రచారాలు నిలిపివేసిన సమయం నుండి పోలింగ్ పూర్తయ్యేంతవరకు మద్యంపై నియంత్రణ ఉంటుందన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడానికి అన్ని రకాలుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టామని, యువ ఓటర్లు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎండలను దృష్టిలో పెట్టుకొని అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద  నీడ, తాగునీటి సదుపాయాలు కల్పించామన్నారు. దివ్యాంగ ఓటర్లకు  ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించామని, వారిని తీసుకురావడానికి, తీసుకు వెళ్ళడానికి సహాయకులను ఏర్పాటు చేశామన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అంబులెన్స్ సైతం  అందుబాటులో ఉంచామని, ఎన్నికలు పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ములుగు రెవెన్యూ ఆదనపు కలెక్టర్, శాసన మండలి పట్టబద్రుల సహాయ  రిటర్నింగ్ అధికారి సిహెచ్. మహేందర్ జి, ఏ ఆర్ ఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, పార్లమెంట్ ఎన్నికల డిప్యూటీ రిటర్నింగ్ ఆఫీసర్ స్పెషల్ కలెక్టర్ నటరాజ్, సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ యు.వెంకటేశ్వర్లు, మీడియా నోడల్ అధికారి ఇండస్ట్రీస్ జిఎం.  కోటేశ్వర రావు పాల్గొన్నారు.