– విచారణ అధికారిగా అదనపు కలెక్టర్ పూర్ణచందర్ నివేదిక
నవతెలంగాణ నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ హిల్ కాలనీలో తాగునీటి ట్యాంకులో కోతులు పడి చనిపోయిన సంఘటనపై జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై నందికొండ మున్సిపల్ కమిషనర్, నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లకు ఆమె షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంతేకాక స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీ.పూర్ణచందర్ ను విచారణ అధికారిగా నియమించారు. సంఘటనపై తక్షణమే పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని ఆమె ఆదేశించారు. దీనితో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గురువారమే నందికొండ హిల్ కాలనీని సందర్శించి విచారణ చేపట్టి తన నివేదికను సమర్పించారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విచారణ నివేదిక ప్రకారం నాగార్జునసాగర్ విజయ విహార్ హిల్ కాలనీలో కోతులు పడి చనిపోయిన వాటర్ ట్యాంక్ ద్వారా కేవలం 9 గృహాలకు మాత్రమే తాగునీరు సరఫరా అవుతున్నట్లు తన విచారణలో తేలిందని, ఈ ఇండ్లలో 49 మంది మాత్రమే ఉన్నారని వెల్లడించారు. మొత్తం హిల్ కాలనీలో 3 పెద్ద ట్యాంకులు ఉన్నాయని, 2 హిల్ కాలనీకి, మరొకటి పైలాన్ కాలనికి తాగునీరు అందిస్తున్నాయని, కోతులు పడి చనిపోయిన తాగునీటి ట్యాంకు ప్రత్యేకంగా ఉందని, ఇది కేవలం 9 ఇండ్లకు మాత్రమే తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు తన విచారణలో తెలిసిందని పేర్కొన్నారు. సంఘటన జరిగిన వెంటనే నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు కోతులు పడి చనిపోయిన నీటి ట్యాంకు నుండి నీరు రావటం లేదని గుర్తించడం జరిగిందని, ఈ నెల 3 తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఈ విషయాన్ని గమనించడం జరిగిందని, తక్షణమే నీటి సరఫరా నిలిపివేయడమే కాకుండా, చనిపోయిన కోతులను తొలగించినట్లు వెల్లడించారు.
అంతేకాక మిషన్ భగీరథ ప్రధాన ఇంట్రా పైపులైన్ తో ఉన్న లింకును కూడా తీసివేయడం జరిగిందని, ఈ సంఘటన వల్ల ఇప్పటివరకు ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సైతం హిల్ కాలనీని సందర్శించి ప్రజల ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించడం జరిగిందని, ఆరోగ్య శాఖ ద్వారా అవసరమైన మందులు కూడా సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. అలాగే 9 గృహాలకు సంబంధించిన ప్రజలకు తాగునీరు అందించేందుకు ప్రత్యామ్నాయ పైపులైను ఏర్పాటు చేయడం జరిగిందని తన విచారణ నివేదికలో పేర్కొన్నారు.