నవతెలంగాణ – మల్హర్ రావు
ఏమ్మా మీది ఏ ఊరు.. ఎక్కడి నుంచి వచ్చారు.. ఏ వ్యాధితో బాధపడుతున్నారు.. వైద్య పరీక్షలు చేయించుకున్నారని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వైద్య సేవలకు వచ్చిన ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు.బుధవారం కాటారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాలు మొత్తం కలియ తిరిగి ఓపి రిజిస్టర్ తో పాటు ఆసుపత్రిలో సేవలు పొందుతున్న ప్రజలను వైద్య సేవలపై ఆరా తీశారు. రక్త పరీక్ష నిర్వహించే లాబ్ పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలల్లో మొక్కలు నాటి ఆహ్లాదకరంగా తయారు చేయాలన్నారు. జలుబు, దగ్గుతో బాధపడేవారు ఎక్కువగా వస్తున్నారని ఈ రోజు 150 మంది వరకు వైద్య సేవలకు వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. జ్వరాలు నియంత్రణకు ఇంటింటి సర్వే చేయాలని అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. బీపీ, మధుమేహం మందులు అందుబాటులో ఉండాలన్నారు. రక్త పరిక్షలో లక్షణాలు ఉంటే ఎలీషా పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించాలని సూచించారు. మహదేవపూర్, పలిమెల, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో వైద్యుల నివాస గృహాలు నిర్మాణానికి ప్రతిపాదనలు అందజేయాలని సూచించారు. కాలేశ్వరంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి భూములు కేటాయించాల్సి ఉన్నట్లు తెలిపారు.అనంతరం బాలాజీ హాస్పిటల్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో తప్పనిసరిగా వైద్య సేవల ధరల పట్టిక ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధరల పట్టిక ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చామని ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైధ్యాధికారులు తరచూ ప్రైవేట్ ఆసుపత్రులు తనిఖీలు చేయాలని, ఎక్కడైనా ధరల పట్టిక ఏర్పాటు చేయకపోయినా, వైద్య సేవల్లో నిబంధనలు పాటించకపోయినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, డిపిఓ నారాయణరావు, ఆర్డీవో మంగీలాల్, తహసిల్దార్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.