
ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం డిచ్ పల్లి మండల కేంద్రంలోని సి.ఎం.సి మెడికల్ కళాశాలలను పరిశీలించారు. గత ఐదేళ్ల క్రితం జరిగిన ఎమ్మెల్యే, ఎంపి ఎన్నికల్లో సిఎంసి లోనే ఓట్ల లెక్కింపు చేపట్టామని అధికారులు కలెక్టర్ కు వివరించారు. త్వరలో జరుగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, ఈవీఎం లను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ వంటి వాటికి అనువుగా ఉన్న కేంద్రాలు ఏవీ అన్న వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రవాణా, పార్కింగ్ సదుపాయాలతో పాటు, భద్రతాపరమైన అంశాల గురించి తనవెంట ఉన్న అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, డీసీపీ జయరాం తదితరులతో ప్రాథమికంగా చర్చించారు. ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా ఎన్నికల నిర్వహణ సాఫీగా జరిగేలా అన్ని వసతులతో కూడిన భవన సముదాయాన్ని గుర్తించి ఎన్నికల సంఘానికి వివరాలు పంపించాల్సి ఉందని కలెక్టర్ అన్నారు. ఈ మేరకు అందుబాటులో ఉన్న మరికొన్ని కళాశాలలు, ఇతర కార్యాలయాల భవనాలను పరిశీలించి తనకు పూర్తి వివరాలు తెలియజేయాలని నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ ను ఆదేశించారు.