
– చెక్ పోస్ట్ లలో సిబ్బందిని ఏర్పాటు చేయాలి
– పట్టణ స్థాయి నుండి గ్రామస్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
– ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే ఎన్నికల కమిషన్ ఆదేశాలను తూచా తప్పక పాటించాలి
– కలెక్టర్ హరిచందన దాసరి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులది కీలక పాత్ర అని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకై నియమించిన నోడల్ అధికారులతో గురువారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నోడల్ అధికారులందరూ వారికి కేటాయించిన అంశాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పార్లమెంటు ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాలని ఆమె సూచించారు. అన్ని విషయాలపై నోడల్ టీములకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని శిక్షణ నోడల్ అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ ను ఆదేశించారు. మొదటి ర్యాండైజేషన్ తర్వాత పిఓ, ఏపీఓలకు సైతం శిక్షణ ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల సామాగ్రికి సంబంధించి ఎప్పటికప్పుడు రాష్ట్రస్థాయి నోడల్ అధికారులతో సంప్రదింపులు చేస్తూ ఎన్నికల సామాగ్రిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఎన్నికల మెటీరియల్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి, డిపిఓ మురళిని ఆదేశించారు. ట్రాన్స్పోర్ట్ లో భాగంగా అవసరమైన వాహనాల ఏర్పాటు, అంతర్రాష్ట్ర సరిహద్దులలో, జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లలో సిబ్బంది ని ఏర్పాటు చేయాలని, ఇందులో పోలీస్, ఆర్టీవో, ఆర్టీసీ, ఎక్సైజ్ ఉద్యోగులను నియమించాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల యాప్ లతో పాటు, ఎంసీఎంసీ, సి- విజిల్ పై కంప్యూటరైజేషన్ ఆన్లైన్ శిక్షణ ఇవ్వాలని కంప్యూటరైజేషన్ నోడల్ అధికారి, డిఐఓ గణపతి రావును ఆదేశించారు. పట్టణ స్థాయి నుండి గ్రామస్థాయి వరకు ఓటరు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని, ముఖ్యంగా వలస కూలీలు, దివ్యాంగులు, మహిళా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని, ప్రత్యేకించి హోం ఓటింగ్ పై సరైన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిందిగా స్వీప్ నోడల్ అధికారి, జెడ్పి సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డిని ఆదేశించారు. పార్లమెంట్ ఎన్నికలకు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, అంతర్ రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్ట్ ల ఏర్పాటు, సెక్టోరల్ అధికారుల నియామకం, తదితర విషయాలపై దృష్టి సారించాలని అదనపు ఎస్పి రాములు నాయక్ కు సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన వెంటనే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 24 గంటలు, 42 గంటలు, 72 గంటల్లో తీసుకోవాల్సిన చర్యలపై తు.చ తప్పకుండా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేస్తూ ముందుకు సాగాలని ఎన్నికల ప్రవర్తన నియమావళి నోడల్ అధికారి, డిప్యూటీ సీఈవో ను ఆదేశించారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, పోస్టల్ బ్యాలెట్ వీటన్నిటి పై సంబంధిత నోడల్ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే మీడియా నిర్వహణ, పెయిడ్ న్యూస్ తనిఖీ చేయడం, ప్రకటనల ముందస్తు అనుమతి వంటి వాటిపై మీడియా నోడల్ అధికారి దృష్టి సారించాలన్నారు. కమ్యూనికేషన్ ప్లాన్ రూపొందించడం, ఓటరు జాబితా తయారు పై సంబంధిత నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల సందర్భంగా వచ్చే ఫిర్యాదులను వెంట వెంటనే పరిష్కరించడం , సి విజిల్ ద్వారా వచ్చే ఫిర్యాదులకు తక్షణమే స్పందించి పరిష్కరించాలని డిఆర్ఓ రాజ్యలక్ష్మి ని ఆదేశించారు. అబ్జర్వర్లకు ఏర్పాటు చేసే లైసెన్ అధికారులు, దివ్యాంగుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసే వీల్ చైర్లు, డేటా, అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలలో కనీస సౌకర్యాల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, అదనపు ఎస్పీ రాములు నాయక్, డి ఎఫ్ ఓ రాజశేఖర్, డిఆర్ఓ రాజ్యలక్ష్మి, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.