
నవతెలంగాణ – కోహెడ
మండలంలోని తంగళ్ళపల్లి కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ మనుచౌదరి అకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పనితీరును, ఉపాధ్యాయుల బోధనను గూర్చి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి క్లాస్‌రూమ్‌లోకి వెళ్లి విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరిశీలించి ఏదైనా సబ్జెక్టు అర్థం కాకపోతే సంబంధిత ఉపాధ్యాయులకు చెప్పాలని విద్యార్థులకు సూచించారు. అలాగే విద్యార్థులను వ్యక్తిగతంగా వారి సామర్థ్యాలను పరీశీలించి, వారు ఏ సబ్జెక్టులలో వెనుకబడి ఉన్నారో గమనించి ప్రతి నెలలో ఒక్కొక్క సబ్జెక్టు చొప్పున అన్ని సబ్జెక్టులపై ప్రత్యేక క్లాస్ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. సీసీరోడ్, డార్మెంటరీ, దోమలు రాకుండా కిటికీలకు జాలి, కొత్త టాయిలెట్స్, బోర్‌వెల్, సామూహిక ఇంకుడు గుంత కావాలని ప్రత్యేక అధికారిణి హిమబిందు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అవసరమైన మౌలిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. అనంతరం ప్రోఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యాలయ ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట తహాశీల్దార్ సురేఖ, ఈడబ్యూఐడీసీ ఏఈ సాయి, గ్రామస్థులు పాము శ్రీకాంత్, రఫీ, బండిపల్లి నారాయణ, సత్యనారాయణ, పంచాయితి కార్యదర్శి రమేష్, తదితరులు పాల్గొన్నారు.