ఫిర్యాదులను ఎప్పటికప్పుడే పరిష్కరించాలి: కలెక్టర్ నారాయణ రెడ్డి 

Grievances should always be redressed: Collector Narayana Reddyనవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి సందర్భంగా ఆయన ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.ఫిర్యాదుల స్వీకరణ సందర్బంగా జిల్లా కలెక్టర్   ఫిర్యాదులను ఒకటికి రెండుసార్లు చదివి, పిర్యాదుదారులతో మాట్లాడి సమస్యను తెలుసుకుని   ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. జిల్లా అధికారులను తన వద్దకు పిలిపించుకొని ఫిర్యాదులు పరిష్కారం అయ్యేలా చూశారు. ప్రజావాణి ఫిర్యాదులను అన్ని స్థాయిలలో ఎప్పుటికప్పుడే  పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఫిర్యాదులు జాప్యం చేయకూడదని, మండల, గ్రామస్థాయిలో సైతం ఇదే పద్ధతిని అనుసరిస్తే ప్రజల ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కారం అవుతాయని, దానివల్ల ప్రజలకు మేలు కలుగుతుందని అన్నారు.  కాగా సోమవారం 73 ఫిర్యాదులు రాగా వీటిలో ఎప్పటిలాగే వ్యక్తిగత సమస్యలు, భూ సంబంధిత సమస్యలు, ఉపాధి ,ఉద్యోగ అవకాశాలు ,హాస్టల్ సీట్లు వంటివి ఉన్నాయి.స్థానిక సంస్థల అదనపు  కలెక్టర్ టి. పూర్ణచంద్ర, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డిఆర్ఓ డి. రాజ్యలక్ష్మి, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.