– 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు తీసుకున్న రుణాల మాఫీ
– ఆధార్ నెంబర్ ద్వారా రైతుల డుప్లికేట్ బ్యాంకు ఖాతాలను గుర్తించాలి
– రైతు రుణమాఫీ సన్నద్దత పై రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్
నవతెలంగాణ – సిరిసిల్ల
జిల్లాలో రైతు రుణమాఫీ సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.గురువారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో రైతు రుణ మాఫీ సన్నద్దత పై బ్యాంకర్లతో రివ్యూ నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన రుణమాఫీ వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. 61,343 మంది రైతులు ఉండగా ఇందులో 40,567 మంది రైతులకు 240 కోట్ల రుణమాఫీ చేయడం జరిగిందని, 10,756మంది రైతులకు ప్రాసెస్ లో కలదని,మిగిలినవి వివిధ సాంకేతిక (ఆధార్ లింకేజీ లేకపోవడం ఆధార్ నెంబర్ తప్పుగా ఇవ్వడం మరణించిన రైతులు ) మొదలగు ఇతర కారణాల వలన రుణమాఫీ జరుగలేదని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ.. 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 మధ్యలో తీసుకున్న రైతు రుణ మాఫీ చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించిందని కలెక్టర్ తెలిపారు. రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాల ప్రకారం అర్హులందరికీ రుణమాఫీ ఫలితం చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు. గతంలో వచ్చిన విధంగా సాంకేతిక సమస్యల వల్ల రైతులు ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. బ్యాంకుల వారీగా రైతుల రుణ ఖాతా వివరాలు కలెక్టర్ ఆరా తీశారు. రైతుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ అయ్యేలా చూడాలని కలెక్టర్ సూచించారు. రుణమాఫీ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ముందస్తుగానే రైతుల బ్యాంకు ఖాతా ధ్రువీకరణ ప్రక్రియ ప్రారంభించాలని, ఆధార్ నెంబర్ ఆధారంగా డూప్లికేట్ బ్యాంకు ఖాతాలను గుర్తించి శనివారం నాటికి నివేదిక సమర్పించాలని అన్నారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ మల్లికార్జున్, డి.ఏ.ఓ భాస్కర్ ఇతర సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.