– మద్దికుంట, మామిడిపల్లి భూ కబ్జాలపై మూడు రోజుల్లో రిపోర్టు వ్వాలని ఆదేశం
– మూడు నెళ్లైనా పట్టించుకోని రెవెన్యూ అధికారులు
– ఉబచెర్వు, ఉప్పరికుంట, మన్నేవారు కుంట కబ్జాలు
– ఎఫ్‌టీఎల్ పరిధిలో కబ్జాలను నిర్దారించిన ఇరిగేషన్ అధికారులు
– రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు రిపోర్టులిచ్చినా పట్టని వైనం
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
‘ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలి. చెరువులు, కుంటలు కబ్జాకు గురికాకుండా నిఘా కొనసాగించాలి. చెరువులు ఆక్రమణకు గురికా కుండా కాపాడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదే. ఎఫ్‌టీఎల్ సరిహద్దుల్ని పరిశీలించి చెరువులు, కుంటల్ని పరిరక్షించాలి’ ఇదీ..! జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ, కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఎస్పీ చెన్నూరి రూపేష్ భూముల కబ్జాలపై సమీక్షిస్తూ మాట్లాడిన మాటలు. కొత్త మంత్రి, కొత్త కలెక్టర్, కొత్త ఎస్పీ.. వచ్చి రాగానే ప్రభుత్వ భూముల పరిరక్షణపై దృష్టి సారించడాన్ని జిల్లా ప్రజలు స్వాగతించారు. ప్రభుత్వ భూములు, కుంటలు, చెరువుల కబ్జాలకు అడ్డుకట్ట పడుతుందని భావించారు
చెరువులు, కుంట స్థలాల ఆక్రమణలపై ఆగమేఘాల మీద ఇరిగేషన్ అధికారులు విచారణ చేసి కబ్జా జరిగినట్టు నిర్ధారించారు. వెంటనే రెవెన్యూ, మున్సి పల్ అధికారులు రంగంలోకి దిగి కబ్జాకు గురైన భూముల్ని కాపాడుతారనుకుంటే వాళ్లకు పట్టింపే లేకుండా పోయింది. భూముల కబ్జాపై మూడు రోజుల్లో సమగ్ర రిపోర్టు ఇవ్వాలని సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆదేశిస్తే.. మూడు నెలలయినా రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు పట్టట్లేదు. ఎఫ్‌టీఎల్ సరిహద్దులు గుర్తిం చడంలో ల్యాండ్ సర్వే అధికారులు, ఆక్రమణలను తొలగించి చర్యలు తీసుకోవడంలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కాలయాపన చేస్తుండటంతో కబ్జాదారులకు కలిసొస్తుంది.
మూడు రోజుల్లో రిపోర్టులివ్వాలని ఆదేశం
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండంలోని మద్దికుంట శివారులో జాతీయ రహదారి పక్కన రూ.40 కోట్ల విలువ చేసే భూమిని ఫోర్జరీ పత్రాలు సృష్టించి ఢిల్లీకి చెందిన రియల్టర్‌కు విక్రయించిన విషయాన్ని ఆధారాలతో సహా నవతెలంగాణ వెలుగులోకి తెచ్చింది. సర్వే నెంబర్ 88లో ప్రొసీడింగ్ నెంబర్ 3474/93, 1945/2006 ద్వారా 200 మంది ఇండ్లు లేని పేద కార్మికుల ఇండ్ల స్థలాలకు పట్టాలిచ్చారు. ఆర్థిక పరిస్థితి బాగలేక, ఊరికి స్థలాలు దూరంగా ఉండటంతో పేదలు ఇండ్లు కట్టుకో లేదు.
ఆ భూమిని ఓ రాజకీయ నాయకుడైన రియల్టర్ ఫోర్జరీ పత్రాలతో కాజేసిన తంతుపై సమగ్రమైన విచారణ చేయాల్సి ఉన్నా పట్టించుకోవడంలేదు. కంది మండలం లోని మామిడిపల్లి శివారులో సర్వే నెంబర్ 312లో ఉన్న ప్రభుత్వ భూమిలో దివీస్ ధరిత్రి అనే సంస్థ ప్రయివేట్ వెంచర్ చేసి ప్లాట్లు అమ్ముకుంటున్న లోగుట్టును కూడా నవతెలంగాణ వెలుగులోకి తెచ్చింది.
ఈ కబ్జాలను సీరియ స్‌గా తీసుకున్న జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు వీటిపై మూడు రోజుల్లో సమగ్రమైన రిపోర్టు ఇవ్వాలని ఫిబ్రవరి మొదటి వారంలో ఆదేశించారు. కానీ మూడు నెలలు కావస్తున్నా ఇప్పటికీ తహసీల్దార్లు రిపోర్టు ఇవ్వలేదు. కబ్జాదారులకు అనుకూలంగా రిపోర్టు ఇవ్వలేక.. అలాగని కబ్జా జరిగింది నిజమేనంటూ రిపోర్టు పంపలేక రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తున్నారు. ఆఫీస్‌లో రికార్డుల్ని మాయం చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ నెపంతో మరింత జాప్యం చేస్తున్నారు.
కుంట శిఖం భూముల కబ్జా
సదాశివపేటలోని ఉప్పరి కుంటకు సంబంధించిన కుంట కట్టను తొలగించింది. ఓ ప్రయివేట్ వెంచర్ సంస్థ. కుంట కట్టను 100 ఫీట్ల వరకు తొలగించి ఎఫ్‌టీఎల్ పరిధిలో వాళ్ల వెంచర్ కోసం 40 ఫీట్ల రోడ్డు వేశారు. రియల్టర్లు కుంట కట్టను తొలిచి రోడ్డు వేయడంతో పలు చోట్ల కట్టకు లీకేజీ లేర్పడ్డాయి. నీళ్లు వృథాగా పోతున్న విషయాన్ని రైతులు గుర్తించి ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
చెరువు కట్టపైనే వెంచర్‌కు చెందిన జెండాలను కట్టి ఆక్రమణకు పాల్పడుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. చెరువు కట్టకు లీకేజీలు పెట్టి నీరంతా ఖాళీ చేసి ఎండిపోయిన తర్వాత ఆక్రమించి వెంచర్‌లో కలుపుకునేలా రియల్టర్లు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఆర్‌ఐ, సర్వేయర్లు, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ స్పందించి వెంచర్ వాళ్లు వేసిన రోడ్డును చెడగొట్టి చెరువు కట్టకు శాశ్వత మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు. అదే విధంగా మన్నెవారి కుంటలో సర్వే నెంబర్ 437లో నీళ్లు నిలిచే చోట రెండు ఫీట్ల మొరం పోసి క్రీడాప్రాంగణం ఏర్పాటు చేశారు.
ఎఫ్‌టీఎల్ పరిధిలో క్రీడా ప్రాంగణం బోర్డు పెట్టి తర్వాత ఆ భూమిని క్రమంగా ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో క్రీడాప్రాంగణం బోర్డు పెట్టినట్టు ఇరిగేషన్ అధికారులు సర్వే చేసి నిర్ధారించినా మున్సిపల్ అధికారులు పట్టించు కోవడంలేదు. ఉబ చెరువులో 65 మంది శిఖం భూమిని ఆక్రమించి ఇండ్ల్లు కట్టుకున్నారు. దీనిపై అప్పట్లో ఫిర్యాదులు రావడంతో సర్వే చేయాలని అప్పటి కలెక్టర్ ఆదేశించారు. దాంతో జాయింట్ డైరెక్టర్ సర్వే చేసి 65 మందికీ నోటీసులు జారీ చేశారు. అందులో అప్పటి పట్వారీ అంజనేయులు 10 ప్లాట్లను ఆక్రమించి విక్రయిం చారు. అట్టి రికార్డులు కార్యాలయంలో లేకుండా మాయం చేసినట్టు తెలుస్తోంది. 260 సర్వే నెంబర్‌లో బలహీన వర్గాలకు కేటాయించిన పది ప్లాట్లను కూడా బినామీ పేర్లతో తన పట్టా భూమి సర్వే నెంబర్ వేసి పట్టాలు రాయించుకుని ఇండ్లు కట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఊబ చెరువు పక్కన అదే పట్వారీకి ఉన్న పట్టా భూమిలో ప్లాట్లు చేసి అమ్మిన తర్వాత పక్కనే ఉన్న ఊబ చెరువు శిఖం భూమిని ఆక్రమించారు. పట్టా, సర్వే నెంబర్లు వేసి పది ప్లాట్లు ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు.
ఆగని కబ్జాల పర్వం
సంగారెడ్డి జిల్లాలో ముంబయి జాతీయ రహదారి వెంట ఉన్న మండలాల్లో ప్రభుత్వ భూముల కబ్జా పర్వం కొనసాగుతునే ఉంది. అమీన్‌పూర్, పటాన్‌చెరు, కంది, సంగారెడ్డి, సదాశివపేట ప్రాంతాల్లో ఇప్పటికే 50 చోట్ల చెరువు, కుంట, శిఖం భూములు కబ్జాకు గురయ్యాయి. పారిశ్రామికంగా, రియల్ ఎస్టేట్ పరంగా అభివృద్ధి చెందు తున్న ప్రాంతం కావడంతో భూముల విలువ అమాంతం పెరిగింది. వందల సంఖ్యలో వెంచర్లు వెలుస్తున్నాయి. పట్టా భూముల్లో ప్లాట్లు చేస్తున్న రియల్టర్లు పక్కనే ఉన్న కుంట, చెరువు, శిఖం భూముల్ని కలిపేసు కుంటున్నారు. పేదల కోసం ఇండ్ల స్థలాలకు కేటాయించి పంపిణీ చేసిన స్థలాల్ని కూడా కాజేస్తున్నారు. మామిడిపల్లి, కంది, సంగారెడ్డి, సదాశివపేట ప్రాంతాల్లో పేదలకు పట్టాలిచ్చిన భూముల్ని కబ్జా చేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రి దామోదర రాజనర్సింహ భూ కబ్జాలపై అధికారులతో సమీక్ష జరిపి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చెరువులు, కుంట, శిఖం భూముల పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలన్నారు. కబ్జాకు గురి కాకుండా ఎఫ్‌టీఎల్ సరిహద్దుల్ని నిర్ధారించి ఫెన్సింగ్ వేయాలని సూచించారు. అయినా సరే కబ్జాలు మాత్రం ఆగని పరిస్థితి ఉంది.