సాగునీటి అధికారిపై చర్యలకు కలెక్టర్ ఆదేశాలు

– రైతులను అవహేళన చేసిన వారిపై చర్యలు
(నవతెలంగాణ పత్రికకు స్పందన)
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
విధి నిర్వహణలో అలసత్వం, రైతులను అవహేళన చేసిన బీర్కూర్ మండలం సాగునీటి అధికారి పై శాఖపరమైన తగు చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ ఆదేశించినట్లు బాన్సువాడ డివిజన్ సాగునీటి శాఖ ఉన్నతాధికారి తెలిపారు. శనివారం నవ తెలంగాణ పత్రికలో (ఎండుతున్న పంటలు) నీరు లేక నేర్రలు బారుతున్న పొలాలు, అనే శీర్షిక ప్రచరితం కావడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి లు స్పందిస్తూ విధుల పట్ల నిర్లక్ష్యం, రైతులను అవహేళన చేసిన బీర్కూర్ మండల సాగునీటి అధికారి గజానంద్ పై శాఖపరమైన చర్యలు వెంటనే తీసుకోవాలంటూ సాగునీటి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు
బాన్సువాడ డివిజన్ సాగినీటి ఉన్నత అధికారి తెలిపారు. నిజాంసాగర్‌ చివరి ఆయకట్టుకు సాగునీరు అందక వరి పంటలు ఎండుతున్నాయంటూ గత నాలుగు రోజులుగా దామరంచ, కిష్టాపూర్  రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరంచ శివారులోని నిజాంసాగర్‌ 25 ఉప కాల్వ కింద ఉన్న పొలాలకు సాగు నీరందక సుమారుగా 100 ఎకరాల వరకు పంట పొలాలు బీటలు బారుతున్నాయని రైతులు పేర్కొన్నారు. పొలాలు బీటలు బారి వరిపైరు ఎండుతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని చివరి ఆయకట్టు పొలాలకు సాగునీరు అందేలా చూడాలని కోరడంతో బీర్కూరు మండలం సాగునీటి అధికారి గజానంద్ రైతులందరూ ఇంట్లో నిద్రపోతే పంట పొలాలకు నీరెలా వస్తుందని రైతు కష్టాన్ని అవహేళన చేయడంతో రైతులు ఆవేదన చెంది సాగునీటి ఉన్నతాధికారి రాజశేఖర్ కు విషయం తెలియపరిచారు. తాను స్థానికంగా లేదని రాగానే సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. శుక్రవారం రాత్రి నుండి చివరి ఆయకట్టుకు ఇప్పుడు ఇప్పుడే సాగునీరు వస్తుందని చివరి ఆయకట్టుకు సాగునీరు రావడం కొంత ఆలస్యం అవుతుందని బాన్సువాడ డిప్యూటీ ఇంజనీర్ జగదీష్ తెలిపారు. రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని చివరాయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రైతుల పట్ల మండల సాధనకే అధికారి అలా మాట్లాడడం సరికాదన్నారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.