వేములవాడ దేవస్థానం అధికారులతో కలెక్టర్ సమీక్ష..

– నిబంధనల మేరకు అర్హులను కమిటీ ఎంపిక చేయాలి
– పంపిణీ చేసిన కోడె, ఆవుల సంరక్షణ కోసం పకడ్బందీగా అంగీకార పత్రం
– వేములవాడ ఆలయ గోవుల ఉచిత పంపిణీ, తీసుకోవాల్సిన చర్యల పై రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్
నవతెలంగాణ – సిరిసిల్ల
వేములవాడ గోశాల నుంచి అదనపు కోడెలు, ఆవుల ఉచిత పంపిణీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.గురువారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో వేములవాడ ఆలయ గోవుల ఉచిత పంపిణీ పై తీసుకోవాల్సిన చర్యల పై సంబంధిత అధికారులతో సోమవారం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ.. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన గోశాలల యందు భక్తులచే సమర్పించబడిన కోడెలు, ఆవులు అధికంగా పెరగటం వలన ఆసక్తి గల అర్హులైన రైతులు, ఆలయ గోశాలలు, ప్రైవేట్ గోశాలలు, హిందూ మతాల వారికి అదనపు కోడలు ఆవులను ఉచితంగా పంపిణీ చేయుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని అన్నారు. అర్హులైన రైతులు ఆలయ గోశాలల నిర్వహించువారు ప్రైవేట్ గోశాలలు నిర్వహించేవారు హిందూ మతాలకు సంబంధించిన వారి నుంచి దరఖాస్తులు రాకపోయినట్లయితే రైతు సంఘాలు లేదా సొసైటీలకు అవకాశం ఇవ్వబడుతుందని, కోడెలు గోవులు కావలసినవారు కార్యనిర్వహణ అధికారి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ నందు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. గోవుల పంపిణీకి దరఖాస్తులు ఆహ్వానించి నిర్దిష్ట గడువులోపు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో ప్రభుత్వం చే నిర్మించబడిన కమిటీ పరిశీలించి, అర్హులైన లబ్ధిదారులను నిబంధనల ప్రకారం పకడ్బందీగా ఎంపిక చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రస్తుతం వేములవాడ దేవస్థానానికి సంవత్సరానికి సుమారుగా 2500 కోడెలు భక్తుల సమర్పిస్తారని, దేవాలయం వద్ద 450 నుంచి 500 వరకు కోడెలు నిల్వ ఉంచుకొని , మిగిలినవి వివిధ గోశాలలకు, అర్హులకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. తిప్పాపురం నందు గల గోశాలలో అదనపు షెడ్యూల్ నిర్మాణం, సీసీ ఫ్లోరింగ్, డ్రైనేజ్ నిర్మాణం నిమిత్తం దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కోటి రూపాయల నిధులు మంజూరు చేశారని, ఆ పనులు త్వరితగతిన పూర్తి చేయుటకు షాట్ టెండర్ ప్రక్రియ ముగిసిందని, పనులు వెంటనే  ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఉచిత గోవులకు సంబంధించి దరఖాస్తుల ఆహ్వాన సమాచారం ఆన్ లైన్, గూగుల్ లింక్, దేవస్థానం వెబ్ సైట్, ఆఫ్ లైన్ నందు అందుబాటులో ఉంచాలని అన్నారు.  ప్రతి ఒక అర్హులకు కోడెలు ఆవులు ఏ విధంగా పంపిణీ చేయాలో ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వేములవాడ దేవస్థానం గోశాల నుంచి కోడెలు, ఆవులు పంపిణీ చేసిన తర్వాత వాటి నిర్వహణ పకడ్బందీగా ఉండాలని, జిల్లాలోని అధికారులు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. గోశాల నుంచి పంపిణీ చేసే ప్రతి కోడె, ఆవులకు వైద్య పరీక్షలు నిర్వహించి  ఆరోగ్య రిపోర్ట్ 3 కాపీలు సిద్దం చేయాలని, ఒక కాపీ  లబ్ధిదారుడికి, రెండవ కాపీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి, మూడవ కాపీ సిరిసిల్ల జిల్లా పశు సంవర్థక శాఖ  వద్ద ఉండాలని అన్నారు. పంపిణీ చేసిన పశువులను సైతం కొన్ని రోజులు పశుసంవర్ధక శాఖ నుంచి వైద్యులు వెళ్లి పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. దేవస్థానం పంపిణీ చేసిన కోడెలు, ఆవుల పట్ల  హింసకు పాల్పడినా, నిర్లక్ష్యం వహించిన చట్ట ప్రకారం అత్యంత కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఖిమ్యా నాయక్,  వేములవాడ ఆలయ ఈ.ఓ. వినోద్ రెడ్డి, సంస్థ , జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా. కొనురయ్య ,సంబంధిత ఆలయ అధికారులు ఉన్నారు.