కలెక్టర్ సాబ్.. జర ఇదర్ దేఖోనా..

– యథేచ్ఛగా 126, 817, 639, సర్వే నెంబర్ లలో ప్రభుత్వ భూములు కబ్జా
– రిజిస్ట్రేషన్లు లేని ఇండ్లకు ఇంటి నెంబర్లు కేటాయింపు
– స్థలాలను అమ్ముకుంటున్న రీయల్ ఎస్టేట్ వ్యాపారులు
– గత ప్రభుత్వ హయాంలో రెచ్చిపోయిన కబ్జా దారులు
– నేటికి చర్యలు శూన్యం…?
– నిద్రావస్థలో రెవెన్యూ, వక్ఫ్ బోర్డు అధికారులు
నవతెలంగాణ – సూర్యాపేట
జిల్లా కేంద్రంలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమణ దారులు యధేచ్చగా కబ్జాకు పాల్పడుతూ రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు.ఈ తతంగం అంతా కూడా గత బి.ఆర్.యస్ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకుంది. ఆనాడు మంత్రి క్యాంపు కార్యాలయం సపోర్ట్ తో కబ్జా దారులతో పాటు, బి.ఆర్.యస్ నాయకులో కొందరు ప్రభుత్వ భూములను అప్పనంగా అక్రమిoచుకున్నారు. ప్రధానంగా పట్టణంలోని జేజే నగర్ లో గల 817 సర్వే నెంబర్ లో ఒక ఎకరం ఆరు గుంటల స్థలం,స్థానిక కిరాణం ఫ్యాన్సీ అసోసియేషన్ భవనం వెనుక గల వక్ఫ్ బోర్డు కు చెందిన 639  సర్వేనెంబర్ లోని 1.20 గుంటల విస్తీర్ణం గల భూమి కబ్జాలకు గురైంది. ఇక కుడ కుడా లోని 126 వ సర్వే నెంబర్ లోని ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిలో ఏకంగా రిజిస్ట్రేషన్లు కావడం గమనార్హం.వీటికి ఆనాడు జిల్లా స్థాయి అధికారుల నుండి క్రింది స్థాయి అధికారులు మద్దతు ఇవ్వడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలావుండగా ఆనాడు కొందరు   నిరుపేదలతో పాటు జర్నలిస్టులు గత ఐదు సంవత్సరాలుగా ఆనాటి మంత్రి ప్రస్తుత హ్యాట్రిక్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చుట్టూ ఇండ్ల స్థలాలు కావాలంటూ ప్రతి రోజు ప్రదక్షిణలు చేశారు.కాగా వీరిని కాదని వినూత్నoగా క్యాంపు కార్యాలయo లో భజన చేసే బి.ఆర్.యస్ నాయకులతో పాటు కొందరూ జర్నలిస్టులకు  126 సర్వే నెంబర్ లో ఒక్కొక్కరికి 200 గజాల స్థలం నుండి 1000 గజాల స్థలం వరకు కేటాయించడం గమన్హారం.
మరి తమకు  అర్హత లేదా అని మిగిలిన జర్నలిస్టులతో పాటు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నుండి పని చేస్తున్న నిరుపేద ఉద్యమ కారులు ప్రశ్నిస్తున్నారు. కాగా గతంలో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో 126 సర్వే నెంబర్ లో నిరుపేదలు గుడిసెలు వేసుకొని ఆందోళనలు చేశారు. వారిని పోలీసులతో బలవంతంగా అక్కడి నుండి ఖాళీ చేయించారు.కానీ ఇదే సర్వే నెంబర్ లో కోటీశ్వరులకు, లక్షాధికారులకు, ప్రజాప్రతినిధులకు క్యాంపు ఆఫీస్ లో రోజు భజన చేసే బజనపరులకు ఐదు ఎకరాల స్థలాన్ని అప్పనంగా కేటాయించారు. వాస్తవంగా ఇందులో ఒక్క నిరుపేద కూడా లేకపోవడం గమనార్హం. ఇదిగాక 58,59 జివో కు విరుద్ధంగా స్థలంలో ఇండ్ల నిర్మాణం లేక పోయినా వున్నట్లుగా చిత్రీకరిస్తు వాటికి ఇంటి నెంబర్లు కూడా కేటాయిస్తూ మార్పింగ్ ఫోటోలు పెట్టి కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఒక నిరుపేద తన స్వంత జాగా లో అరకొరగా ఇంటిని నిర్మించుకుంటుంటే పర్మిషన్ ల పేరిట నానా యాగీ చేసే రెవెన్యూ, మున్సిపల్ యంత్రంగానికి 126,817,639 ప్రభుత్వ సర్వే నెంబర్ లో గల భూములు కబ్జా లు,రిజిస్ట్రేషన్లు అవుతుంటే కండ్లకు కనిపించ లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ సర్వే నెంబర్లలో జరిగే అక్రమాలపై పలు మార్లు ఆందోళనలు జరగడంతో పాటు సోషల్ మీడియాలలో న్యూస్ వైరల్ అయినప్పటికీ సంబంధిత అధికారులు క్యాంపు కార్యాలయానికి వంత పాడుతూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు.దీంతో కోట్లాది రూపాయల భూములు అన్యాక్రాంతం అయ్యాయి. ప్రధానంగా 126 సర్వే నెంబర్ లో ఇండ్లు లేకపోయినా కొందరూ  బిఆర్ఎస్ నాయకులకు స్థలాల కేటాయిస్తూ ఆనాటి  కలెక్టర్ జివో అమలు చేయడంతో పాటు రాత్రికి రాత్రే పట్టాలు ఇవ్వడం లాంటి భూ కుంభకోణం , భూ దందాలపై బీజేపీ రాష్ట్ర నాయకులు సంకినేని వరుణ్ రావు హైకోర్టుకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటికే ఈ సర్వే నెంబర్ పై కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు విచారణ జరుపుతున్నారు. కానీ దీనిపై ఇంకా నేటికి కూడా ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం గమన్హారo. అదేవిధంగా పట్టణ నడిబొడ్డున జేజే నగర్ లోని 28 వ వార్డులో గల 817 సర్వే నెంబర్ కు చెందిన ప్రభుత్వ భూమి లో గల ఒక ఎకరం 6 గుంటల స్థలం యధేచ్చగా కబ్జా కు గురైనప్పటి సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారు.
ఇక్కడ పెద్ద ఎత్తున కబ్జాల పర్వం కొనసాగుతున్నప్పటికీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అధికారులు ఆశించిన రీతిలో స్పందించక పోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆనాడు క్యాంపు కార్యాలయం మద్దతుగా నిలవడంతో స్థలాన్ని ఆక్రమించి యధేచ్చగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు.ఈ స్థలాన్ని రియల్ ఎస్టేట్ గా ప్లాట్లు చేసి అమ్ముకున్నారు. దీనికి మున్సిపల్ అధికారులు ఇంటి నెంబర్లు కేటాయించడం గమన్హారo.పట్టణంలోని కొత్త ఫైర్ స్టేషన్ వద్ద ఉన్న కిరాణం ఫ్యాన్సీ భవనం ప్రక్క వీధిలో పీర్ల కొట్టం కు సంబంధించిన 639  సర్వేనెంబర్ లోని 1.20 గుంటల విస్తీర్ణం గల భూమి వక్ఫ్  బోర్డ్ గెజిట్ గా నమోదై ఉన్నది. కోట్లాది రూపాయల విలువ చేసే ఈ భూమి పై కబ్జాదారుల “నజర్” దీని పైనే పడ్డాయి. ఇప్పటికే కొద్దిగా కొద్దిగా స్థలం కబ్జాలకు గురై ఎకరం 20 గుంటల స్థలం రాను రాను కుదించుకుని పోయింది. ఇప్పటికి కూడా ఈ స్థలం ధరణి వెబ్సైట్ లో వక్ఫ్ బోర్డ్ కు చెందిన స్థలంగానే చూపెట్టుతుంది.కాగా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు గోతి కాడి గుంట నక్కలా మాదిరిగా ఇక్కడే ప్రదక్షిణలు చేస్తూ మిగిలిన స్థలాన్ని కాజేసి ప్లాట్లు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.ఈ రకంగా ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్న వీటిపై అధికారులు స్పందించక పోవడం అన్యాయమని పలువురు పేర్కొంటున్నారు.ఇందుకు గాను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ స్పందించి ఈ అక్రమాలపై దృష్టి సారించి స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడడంతో పాటు అక్రమార్కుల పై న్యాయ విచారణ జరిపించాలని పలువురు కోరుతున్నారు. ఇక కబ్జా తో పాటు అక్రమ రిజిస్ట్రేషన్ లు అయినా 126,817,639 సర్వే నెంబర్ లలో ఉన్న ప్రభుత్వ స్థలాలను ఇండ్లు లేని అర్హులైన తమకు కేటాయించి న్యాయం చేయాలని మాజీమంత్రి, నియోజకవర్గ ఇంచార్జి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కి నిరుపేదలు,మిగిలిన జర్నలిస్టులు మొర పెట్టుకుంటున్నారు.