
రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలింగ్ బూత్ లెవెల్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల నమోదు పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బిఎల్వో లు ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల పేర్లు ఓటర్ జాబితాలో ఉన్నాయో లేదో నిర్ధారణ చేసుకోవాలన్నారు. ఓటర్ జాబితాలో ప్రముఖులు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, మాజీ జెడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ పేర్లు ఉండే విధంగా చూడవలసిన బాధ్యత రాజకీయ పార్టీల ప్రతినిధులదన్నారు. 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్ల నిండిన యువతి, యువకులు ఓటర్ గా నమోదు చేసుకునే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు చూడాలని కోరారు. యువతి, యువకులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా చూడాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎన్నికల విభాగం అధికారులు ఇందిరా ప్రియదర్శిని, అనిల్ కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రభాకర్ రెడ్డి, సిఐటియు జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్, కాసిం, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్, మదన్ లాల్ తదితరులు పాల్గొన్నారు.