ఎన్నికల విధులు,బాధ్యతలపై పారదర్శకంగా ఉండాలి: కలెక్టర్

– జిల్లాలో మొదటి రోజు శిక్షణకు 1188  మంది హాజరు.
– శిక్షణకు హాజరు కానీ సిబ్బంది రెండో రోజు శిక్షణలో తప్పక పాల్గొనాలి.
– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్.
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో ఎన్నికల విధులు, బాధ్యతలు పారదర్శకంగా   చేపట్టాలని  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ సూచించారు.  సోమవారం  సూర్యాపేట సెగ్మెంట్ సంబంధించిన పి.ఓ, ఏ.పి.ఓ లకు  స్థానిక ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్ లో   లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో  నిర్వహించిన శిక్షణా తరగతుల్లో   కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సిబ్బంది విధులు, బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈవిఎం యంత్రాల పనితీరు పై సిబ్బంది సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని అన్నారు.  జిల్లాలోని నాలుగు నియోజక వర్గాలలో పి.ఓ, ఏ.పి.ఓ లకు ఎన్నికల రోజున నిర్వహించే విదివిధానాలపై రెండు రోజుల శిక్షణా కార్యక్రమంలో  భాగంగా సూర్యాపేటలో పాల్గొన్నారు.రెండు రోజుల శిక్షణా కార్యక్రమాల్లో శిక్షణ పొందిన పి.ఓ, ఏ.పి.ఓ లు పోలింగ్ కేంద్రాల్లో  సమర్థవంతంగా  ఎన్నికల నిర్వహణ చేపట్టాలని సూచించారు. జిల్లాలో జరిగే లోక్ సభ ఎన్నికల పోలింగ్ పకడ్బందీగా పారదర్శకంగా జరిగేందుకు కార్యాచరణ రూపొందించుకోవాలని   అన్నారు.  జిల్లా ఎన్నికల అధికారి  పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాలలో ప్రిసీడింగ్ అధికారులు, సహాయ ప్రిసీడింగ్ అధికారులు చేయవలసిన విధులపై దిశా నిర్దేశ్యం చేశారు. ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని  అన్నారు.  ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని సూచించారు.  పి.ఓ, ఏ.పి.ఓ లు ఈవీఎం యంత్రాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, మాక్ పోల్ నిర్వహణ, ఈవిఎం యంత్రాల పని తీరు, బాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ ,వి.వి ప్యాట్ల కనెక్షన్లు, వాటి  పని తీరు, మరమ్మత్తు జరిగితే తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు. నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లో   1416 మంది పి.ఓ, ఏ.పి.ఓ లకు గాను మొదటి రోజు 1188 మంది హాజరు అయ్యారని  మొదటి రోజు హాజరు కానీ 228 మంది సిబ్బంది రెండో రోజు శిక్షణా కార్యక్రమాల్లో తప్పక పాల్గొనాలని లేని యెడల చర్యలు తీసుకోబడునని సూచించారు.  జిల్లాలో పోలింగ్ కు ముందస్తుగా ప్రతి ఓటర్ కు ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయాలని, ఓటర్ సహాయ కేంద్రాల ద్వారా త్వరితగతిన ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉపయోగపడుతుందని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఆర్.డి ఓ వేణు మాధవ్, తహశీల్దార్ శ్యామ్  సుందర్ రెడ్డి, డిఏఓ  జి. శ్రీధర్ రేడ్డి ,ఎన్నిక సిబ్బంది మాస్టర్ ట్రైనర్లు, తదితరులు పాల్గొన్నారు.