వైద్య కళాశాల పనులను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఎస్ఎల్బీసీ వద్ద నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కళాశాల మొత్తం కలియ తిరుగుతూ కళాశాల ప్లాన్ ను పరిశీలించారు. ఇంకా ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే ముందే సరి చేసుకోవాలని, కమ్యూనిటీ మెడిసిన్ సెంటర్ అవసరమైన  హాల్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కొత్త భవనం నిర్మాణం ఆలస్యానికి గల కారణాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకోగా, ఇసుక వల్ల ఆలస్యమైందని తెలిపారు. ఇందుకు జిల్లా కలెక్టర్ స్పందించి భవన నిర్మాణానికి అవసరమైన ఇసుకను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, సాధ్యమైనంత త్వరగా భవన నిర్మాణాన్ని పూర్తిచేయాలని, ప్రత్యేకించి ఈనెలాఖరు నాటికిపూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. ఇందుకు టిజి ఎంఐడిసి అధికారులతో పాటు, కాంట్రాక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 15 నాటికి భవనాన్ని పూర్తి చేసి ఇస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ నిత్యానంద్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ రాజకుమారి, ఆయా విభాగాల అధిపతులు, తదితరులు ఉన్నారు.