యాదాద్రి బ్రహ్మోత్సవాలను పగడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

– యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే
నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవ ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే అధికారులను ఆదేశించారు. బుధవారం నాడు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు- 2024 ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 11వ తేదీ నుండి 21వ తేదీ వరకు నిర్వహించబడే బ్రహ్మోత్సవాలలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో  భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గ్రామీణ నీటి పారుదల శాఖ మంచి నీటి సరఫరా పెంచాలని,  ప్రత్యేకంగా 17, 18, 19వ తేదీలలో ఎక్కువ సంఖ్యలో నీటి సరఫరా మరింత మెరుగుపరచాలని, భక్తులు తాగునీటికి  ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. పుణ్యక్షేత్రంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకంగా గ్రామపంచాయతీ,  మున్సిపాలిటీల నుండి అదనపు సిబ్బందిని  నియమించుకొని పారిశుద్ధ్య చర్యలు నిర్వహించాలని  మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల రోజులలో బస్సుల సంఖ్య పెంచాలని,  అన్ని మండల కేంద్రాల నుండి బస్సులు నడపాలని,  సమయపాలన పాటించాలని,  ముఖ్యంగా స్వామివారి  కళ్యాణం జరిగే 18 వ తేదీ రాత్రి 8:45 గంటలకు కళ్యాణం పూర్తయిన తర్వాత తిరిగి వెళ్లేందుకు అధిక సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేసుకోవాలని,  ఉప్పల్, చెంగిచెర్ల డిపోల సహకారంతో అదనపు బస్సులను ఏర్పాటు చేసుకోవాలని ఆర్టీసీ డిపో మేనేజరును ఆదేశించారు. అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా యాదగిరిగుట్ట పట్టణంలో,  గుట్ట పైన అగ్నిమాపక ఫైర్ సర్వీసులతో  సిబ్బంది సదాసిద్ధంగా ఉండాలని తెలిపారు. 104, 108 అంబులెన్స్ సర్వీసులను అందుబాటులో ఉంచాలని, గుట్ట పైన కింద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని,  అత్యవసర మందులను సిద్ధం చేసుకోవాలని,  24×7 వైద్య సిబ్బంది విధులు నిర్వహించాలని, హృద్యోగ నిపుణులు, వారి బ్లడ్ గ్రూపుకు సరిపడు బ్లడ్ బాటిల్స్ అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా వైద్యాధికారికి సూచించారు. ప్రముఖుల రాక సందర్భంగా ప్రోటోకాల్ ఏర్పాట్లు పటిష్టంగా  ఉండాలని, అధిక సంఖ్యలో భక్తులు వివిధ వాహనముల ద్వారా వస్తున్నందున, అన్ని వాహనములను గుట్ట పైకి అనుమతించకుండా, బస్సుల సదుపాయం సద్వినియోగం చేసుకోవాలని, గుట్ట ఘాట్ రోడ్ మీద షాప్ లకు అనుమతి ఇవ్వకుండా తగు చర్యలు తీసుకోవాలని భువనగిరి ఆర్డీవోకు సూచించారు.  ఆర్.అండ్.బి. అధికారులు రోడ్ల పైన ఉన్న గుంతలను పూడ్చాలని,  అవసరమైన మరమ్మతులను చేపట్టాలని ఆదేశించారు. గుట్టపైకి అనుమతించే ఆటోల సామర్థ్యాన్ని మించి భక్తులను ఆటోలలో ఎక్కించుకోకుండా ఆటోలు నడిపేవారికి స్పస్టమైన ఆదేశాలు జారీ చేయవలసిందిగా రవాణా అధికారికి సూచించారు. బ్రహ్మోత్సవములు జరుగే రోజులలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధముగా చూడాలని,  ఒకవేళ ఏదైనా అంతరాయము ఏర్పడినచో మొబైల్ ట్రాన్స్ ఫార్మర్స్ మరియు జెనరేటర్ అందుబాటులో ఉంచుకోవలసిందిగా విద్యుత్ శాఖకు సూచించారు. ప్రముఖుల పర్యటనలు ఉంటున్నందున  కొన్ని కాటేజ్ లను ముందే రిజర్వు ఉంచుకోవాలని, అలాగే భక్తుల దర్శనాలకు సంబంధించి వివిధ స్థాయిలలో,  చోట్లలో వాలంటీర్లను అధికంగా నియమించుకొని ఇబ్బందులు లేకుండా చూడాలని,  కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో భక్తులకు సూచనలు, జాగ్రత్తలు చెప్పాలని ఆలయ కానీ నిర్వహణ అధికారికి సూచించారు. బ్రహ్మోత్సవాల సందర్భముగా యాదగిరిగుట్ట, పరిసర గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని,  రాష్ట్ర ముఖ్యమంత్రి,  ఇతర మంత్రులు, అధికారులు, విఐపి లు భారీ ఎత్తున హాజరయ్యే అవకాశము ఉన్నందున భారీ భద్రత చర్యలు, పార్కింగ్ ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని డిప్యూటీ పోలీస్ కమీషనర్ ను కోరారు.
డిప్యూటీ పోలీస్ కమిషనర్  రాజేష్ చంద్ర మాట్లాడుతూ..  బ్రహ్మోత్సవాలలో బందోబస్తు, పార్కింగ్,  ట్రాఫిక్ నియంత్రణ,  ప్రముఖుల సెక్యూరిటీ  తదితర ఏర్పాట్లు పటిష్టంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని జాగ్రత్త చర్యలు పోలీసు శాఖ తీసుకుంటుందని తెలిపారు.
కార్యక్రమంలో భువనగిరి ఆర్డిఓ అమరేందర్,  యాదాద్రి ఆలయ ఈవో రామకృష్ణారావు,  అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రమేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి,  తహసిల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్ గౌడ్, వాటర్ గ్రిడ్ ఇంజనీర్ అరుణ రాథోడ్,  విద్యుత్, రోడ్లు భవనాలు, రవాణా, ట్రాఫిక్, పోలీసు అధికారులు, సూపరింటెండెంట్ కే.పార్థసింహారెడ్డి లు  పాల్గొన్నారు.