నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి రైతులకు రుణ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జండగే బ్యాంక్ ప్రతినిధులకు సూచించారు. శుక్రవారం నాడు జిల్లా కలెక్టర్ సమావేశం మందిరంలో జరిగిన బ్యాంక్ కన్సల్టేటివ్ కమిటీ జిల్లా స్థాయి సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. 2024- 25 సంవత్సరానికి సంబంధించి 5279 కోట్ల 34 లక్షలతో జిల్లా వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాధాన్యత రంగానికి అత్యధికంగా 4513 కోట్ల 9 లక్షలు, ప్రాధాన్యేతర రంగానికి 766 కోట్ల 25 లక్షలు కేటాయించడం జరిగిందని తెలిపారు. ప్రాధాన్యతా రంగానికి సంబంధించిన వాటిలో వ్యవసాయ రంగానికి 3636 కోట్ల 27 లక్షలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపార రంగాలకు 762 కోట్ల 29 లక్షలు, విద్యారంగానికి 17 కోట్ల 55 లక్షలు, గృహ రుణాల కింద 70 కోట్ల 20 లక్షలు, సామాజిక మౌళిక సదుపాయాల కోసం 11 కోట్ల 76 లక్షలు, పునరుత్పాదక శక్తి కింద 15 కోట్ల 2 లక్షలు కేటాయించడం జరిగిందని తెలిపారు. జిల్లా వార్షిక ప్రణాళికలో అత్యధిక భాగం వ్యవసాయ రంగానికి కేటాయించడం జరిగిందని తెలిపారు. బ్యాంకర్లు అర్హులైన ప్రతి రైతుకు సకాలంలో రుణాలు అందించి ఆదుకోవాలని, రైతులు కూడా తమ పంట రుణాలను రెన్యువల్ చేయించుకుని పంట సాగుబడి పెట్టుబడికి తిరిగి రుణం పొందాలని సూచించారు.
పి.ఎం.ఇ.జి.పి., పి.ఎం.ఎఫ్.ఎం.ఇ. ఋణాలు లబ్దిదారులకు సకాలంలో అందించాలని సూచించారు. పాడి, మత్స్య పరిశ్రమలకు సంబంధించి లబ్దిదారులకు కిసాన్ క్రెడిట్ ఋణాలు సకాలంలో ఇవ్వాలని తెలిపారు. మహిళలను శక్తిమంతులను చేయడమే మహిళా శక్తి ముఖ్య ఉద్దేశమని, స్వయం సహాయక సంఘాల ద్వారా 14 రకాల జీవనోపాదులకు సంబంధించి అర్హులైన వారికి పాడి గేదెలు,ఫిష్ అవుట్ లెట్, పాల డైరీ, సూక్ష్మ పరిశ్రమలు, మైక్రో ఎంటర్ప్రైజెస్ ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు, వ్యవసాయ అనుబంధ పరికరాలు వంటి వాటిలో మహిళలకు నైపుణ్యాన్ని అందించడం, ఉత్పత్తికి అవసరమైన ఆర్థిక సహకారం అందించాలని బ్యాంకులను కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పరిశ్రమలు, డిఆర్డిఓ తదితర శాఖల ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు బ్యాంకులలో ఉపాధి యూనిట్ల స్థాపన చిన్న, మధ్య తరహా ప్రాధాన్యత రంగాల అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలన్నారు. బ్యాంకులలో రుణ దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూసుకోవాలన్నారు. స్వయం సహాయక సంఘాల రుణాలను సకాలంలో తిరిగి చెల్లించే విధంగా బ్యాంకర్లు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. రిజర్వు బ్యాంకు సూచనల మేరకు నూరు శాతం ప్రజలకు డిజిటల్ సేవలు అందించేలా కృషి చేయాలని, దీనికి బ్యాంకులు ప్రజలకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ మేనేజర్ శివరామకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా పరిశ్రమల అధికారి రవీందర్, ఆర్బిఐ ఏజీఎం గోమతి, నాబార్డ్ డీడీఎం సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కృష్ణ, జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి యాదయ్య, అధికారులు, వివిధ బ్యాంకర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.