రైతు సంబరాలకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

Arrangements for farmer celebrations should be made by: Collector– నేడు లక్ష లోపు రుణాలున్న రైతుల రుణమాఫీ  
– సాయంత్రం 4 గంటలకు సీఎం విసీ ద్వారా రైతులతో మాట్లాడతారు
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
రైతు రుణమాఫీలో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ పొందిన రైతులతో రైతు వేదికలలో సంబరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఇందుకుగాను అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ విషయమై బుధవారం అయిన జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్, మండల వ్యవసాయ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం  2 లక్షల రూపాయల లోపు రుణాలు ఉన్న రైతులకు రుణమాఫీ ప్రకటించిందని, ఇందులో భాగంగా గురువారం లక్ష రూపాయల లోపు రుణాలున్న రైతుల రుణమాఫీ చేయడం జరుగుతున్నదని, ఇందుకు సంబంధించి రైతుల వివరాలన్నీ వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్లకు పంపించడం జరిగిందని తెలిపారు.ఈ మేరకు రుణమాఫీ పొందిన రైతులు గురువారం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సంబంధిత రైతు వేదికల వద్దకు ర్యాలీలు, డప్పులతో  చేరుకుంటారని, అనంతరం సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రుణమాఫీ పొందిన రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా మాట్లాడనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందుకుగాను  జిల్లాలోని అన్ని రైతు వేదికల వద్ద అవసరమైన ఎల్ఈడి స్క్రీన్లు, ఇతర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలలో సంబంధిత ఎమ్మెల్యేలు  పాల్గొంటారని, నల్గొండ అసెంబ్లీకి సంబంధించి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,ఎంపీలు,ఇతర ప్రజాప్రతినిధులు నల్గొండ జిల్లా  కేంద్రంలోని ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించే  సంబరాలకు హాజరుకానున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు రైతులు  ర్యాలీగా ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్ కి చేరుకుంటారని, అనంతరం సాయంత్రము 4 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కొద్దిమంది రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడానున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా లోని అన్ని రైతు వేదికల తో పాటు,  ఎం ఎన్ ఆర్  ఫంక్షన్ హాల్లో  సైతం తగు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆయన వ్యవసాయ శాఖ జిల్లా అధికారిని ఆదేశించారు. ప్రతి మండలం నుండి సుమారు 200 మంది రైతులు రైతు వేదికల వద్ద సంబరాలలో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు.  జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్,  మండలాల  వ్యవసాయ అధికారులు ఈ టెలి కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.